వైభవ్‌ సూర్యవంశీ తమ్ముడి మరో భారీ సెంచరీ.. పదేళ్లకే! | Vaibhav Suryavanshi brother Aashirvad slams another brilliant century | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ తమ్ముడి మరో భారీ సెంచరీ.. ఈసారీ సిక్సర్ల మోతే!

Jun 24 2026 6:20 PM | Updated on Jun 24 2026 6:45 PM

Vaibhav Suryavanshi brother Aashirvad slams another brilliant century

భారత సంచలన క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రస్తుతం టీమిండియాతో కలిసి ఐర్లాండ్‌లో ఉన్నాడు. అతడి అంతర్జాతీయ టీ20 అరంగేట్రం దాదాపుగా ఖరారై పోయింది. ఇలాంటి తరుణంలో వైభవ్‌ సూర్యవంశీ.. తన తమ్ముడి గురించి షేర్‌ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.

టీమిండియాతో  ఐర్లాండ్‌కు
బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పద్నాలుగేళ్లకే రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు. రాయల్స్‌ ఓపెనర్‌గా 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 2026లో సంచలన ప్రదర్శనతో మెరిశాడు.

ఆరెంజ్‌ క్యాప్‌
పదహారు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 776 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ అత్యధిక పరుగుల వీరుడిగా.. ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో భారత్‌- ‘ఎ’ జట్టుతో పాటు.. టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు పదిహేనేళ్ల వైభవ్‌. ఇక శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌ లీగ్‌ దశలో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

అయితే, ఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించిన వైభవ్‌.. జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం టీమిండియాతో కలిసి ఐర్లాండ్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో తన తమ్ముడి విజయాన్ని సెలబ్రేట్‌ చేస్తూ ఇన్‌స్టా స్టోరీ షేర్‌ చేశాడు.

తమ్ముడూ తగ్గేదేలే
సమస్తిపూర్‌ స్థానిక ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రిషవ్‌ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్‌ తమ్ముడు, పదేళ్ల ఆశీర్వాద్‌ సూర్యవంశీ.. భారీ శతకం సాధించాడు. వైశాలి ఎలెవన్‌పై 119 బంతుల్లో 19 బౌండరీలు, ఆరు సిక్సర్లు బాది 168 పరుగులు సాధించాడు. 

ఓపెనర్‌గా దిగిన ఆశీర్వాద్‌ శతక ఇన్నింగ్స్‌ కారణంగా రిషవ్‌ ఎలెవన్‌ ఘన విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన స్కోరు కార్డును షేర్‌ చేస్తూ తమ్ముడి ప్రదర్శన పట్ల వైభవ్‌ మురిసిపోయాడు.

కాగా ఆశీర్వాద్‌ ఇటీవలే తేజ్‌పూర్‌ క్రికెట్‌ అకాడమీ తరఫున మ్యాచ్‌ ఆడి.. 87 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. ఇప్పుడిలా మరో సెంచరీ సాధించాడు. కాగా వైభవ్‌కు అన్న ఉజ్వల్‌, తమ్ముడు ఆశీర్వాద్‌ ఉన్నారు. 

చదవండి: డ్రెసింగ్‌ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement