వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియాకు ఎంపికైనా, అతడికి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి మాత్రం ప్రవేశం లేదు. ఎందుకంటే, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమలు చేస్తున్న బాలల భద్రతా నిబంధనల ప్రకారం, 16 ఏళ్ల లోపు ఆటగాళ్లు పూర్తిస్థాయి పెద్దల డ్రెస్సింగ్ రూమ్‌లను ఉపయోగించకూడదు. ఈ నిబంధనల నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ కోసం ఈసీబీ ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ కేటాయించింది.
మ్యాచ్‌ల సమయంలో మాత్రం వైభవ్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లవచ్చు. సహచర ఆటగాళ్లతో మాట్లాడడం, జట్టు సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ మ్యాచ్‌కు ముందు, తర్వాత దుస్తులు మార్చుకోవడం వంటి కార్యక్రమాల కోసం తప్పనిసరిగా ప్రత్యేక గదినే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈసీబీ ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం వైభవ్ ఎదుర్కొంటున్న పరిస్థితినే 15 ఏళ్ల మ్యాక్స్ డౌమన్ అనే స్టార్ ఫుట్‌బాలర్ ఎదుర్కొంటున్నాడు. ఆర్సెనల్ క్లబ్‌కు ఆడే డౌమన్‌కు కూడా వైభవ్‌లాగే ప్రత్యేక నిబంధనలు వర్తిస్తున్నాయి. అతనికి కూడా క్లబ్‌లో ప్రత్యేక మార్పిడి గది ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల కోసం వైభవ్ భారత జట్టుతో కలిసి యూకేకు చేరుకున్నాడు. ఈ సిరీస్‌లలో అతడు ఏ మ్యాచ్‌లో బరిలోకి దిగినా, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అతి పిన్న వయస్కుడైన భారత అంతర్జాతీయ క్రికెటర్ రికార్డును బద్దలు కొడతాడు.
వైభవ్ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు శ్రీలంకలో జరిగిన ఏ-జట్ల ట్రై సిరీస్‌లోనూ చెలరేగి ఆడాడు. లంకతో జరిగిన ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు టైటిల్ అందించాడు.
ఈ ప్రదర్శన తర్వాత అభిమానులంతా వైభవ్ భారత సీనియర్ జట్టు అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్‌తో 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 26, 28 తేదీల్లో జరుగనుంది. అనంతరం జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూలైంది.
బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది
వైభవ్ యూకే పర్యటన నేపథ్యంలో బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైభవ్ సంరక్షణ, మానసిక సౌకర్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అతడి తల్లిదండ్రులను కూడా యూకే పర్యటనకు అనుమతిచ్చింది. టీమిండియాలో అందరూ పెద్దవారే ఉండటంతో, వైభవ్ కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం ఉపయోగపడుతుందని బీసీసీఐ భావించింది.


