అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు తొలి మ్యాచ్‌.. అందరి చూపు వైభవ్‌వైపే..! | Under 19 cricket world cup 2026 starts from january 15, india to take on USA in first match | Sakshi
Sakshi News home page

అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు తొలి మ్యాచ్‌.. భారత్‌తో యూఎస్‌ఏ 'ఢీ'

Jan 15 2026 7:28 AM | Updated on Jan 15 2026 7:30 AM

Under 19 cricket world cup 2026 starts from january 15, india to take on USA in first match

జింబాబ్వే, నమీబియా వేదికలుగా నేటి నుంచి (జనవరి 15) అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌-2026 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు పోటీపడుతున్నాయి. భారత్‌–యూఎస్‌ఏ మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, టాంజానియా తొలిసారి అండర్-19 వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టింది.

23 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 16 జట్లు 4 గ్రూప్‌లుగా (గ్రూప్‌కు 4) విభజించబడి పోటీపడతాయి. అనంతరం సూపర్‌-6, సెమీస్‌, ఫైనల్‌ జరుగుతాయి. 

గ్రూప్‌ల వివరాలు
- గ్రూప్ A: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జపాన్  
- గ్రూప్ B: భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అమెరికా  
- గ్రూప్ C: జింబాబ్వే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్  
- గ్రూప్ D: వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, టాంజానియా  

ఈ టోర్నీలో భారత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. మొత్తం ఐదు సార్లు టైటిల్‌ గెలిచింది. గత ఎడిషన్‌ (2024) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్‌కు ఆయుశ్‌ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. 

యువ భారత జట్టులో మరి కొంతమంది గమనించదగ్గ ఆటగాళ్లు ఉన్నారు. ఆరోన్‌ జార్జ్‌, విహాన్‌ మల్హోత్రా, వేదాంత్‌ త్రివేది, అభిగ్యాన్‌ కుందు, దీపేశ్‌ దేవేంద్రన్‌, హెనిల్‌ పటేల్‌, అంబ్రిష్‌ లాంటి వారు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు. 

దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌, రోహిత్‌ శర్మ లాంటి వారు అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరిసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అందుకే ఈ టోర్నీకి చాలా ప్రత్యేకత ఉంది.

ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు భారత్‌ (5) కాగా.. ఆస్ట్రేలియా 4, పాకిస్తాన్‌ 2, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ తలో సారి టైటిళ్లు గెలిచాయి. 

ఈ మెగా టోర్నీ భారత అభిమానుల కోసం JioHotstar యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇవాళ జరిగే భారత్‌-యూఎస్‌ఏ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది. బులవాయోలోని క్వీన్స్‌ క్లబ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement