
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సతీమణి రితికా సజ్దే (Ritika Sajdeh) తీవ్ర భావోద్వేగానికి లోనైంది. దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై స్పందిస్తూ ఉద్వేగపూరిత నోట్ రాసింది.
మా హృదయ స్పందన
‘‘వాళ్లు వీటిని ప్రమాదకారులు అంటున్నారు. మేము మాత్రం ఇవే మా హృదయ స్పందన అంటాము. ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలోని వీధి కుక్కలన్నింటినీ బంధించి.. అక్కడి నుంచి పంపించి వేయాలని సుప్రీం కోర్టు అంటోంది.
నైట్ గార్డుల్లా
సూర్యోదయం లేదు.. స్వేచ్ఛా లేదు.. వాటిని ప్రతి ఉదయం పలకరించే ముఖాలు కూడా కనబడవు. అయినా.. ఇవి కేవలం ‘వీధి కుక్కలు’ మాత్రమే కాదు. ఒక్క బిస్కెట్ కోసం టీ స్టాల్ దగ్గర పడిగాపులు పడుతూ ఉంటాయి. రాత్రుళ్లు షాప్‌కీపర్లకు సాయంగా నైట్ గార్డుల్లా చెప్పకుండానే డ్యూటీ చేస్తాయి.
స్కూల్ నుంచి పిల్లలు తిరిగి వస్తుంటే వారిని చూసి ప్రేమగా తోక ఊపుతాయి. చలిలో.. తమను పట్టించుకోని సిటీకి కాపలా కాస్తుంటాయి. అవును.. కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. కుక్కకాట్లు, వాటి వల్ల కలిగే నష్టం కూడా ఉంది.
పంజరంలో బంధిస్తామంటే ఎలా?
అంతమాత్రాన జాతి మొత్తాన్ని పంజరంలో బంధిస్తామంటే ఎలా? ఇదెలాంటి పరిష్కారం? అసలు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారా? రెగ్యులర్‌గా వాక్సినేషన్లు వేస్తున్నారా? కమ్యూనిటీ ఫీడింగ్ జోన్లు ఉన్నాయా. దత్తత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా?.. వీటి ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు.
నోరులేని మూగజీవాలు.. పాపం
అప్పుడు వాటిని శిక్షించాల్సిన పని ఉండదు. బంధించాల్సిన అవసరమూ ఉండదు. నోరులేని మూగజీవాలను కాపాడలేని సమాజం.. తన ఆత్మనే కోల్పోతుంది. ఈరోజు ఈ కుక్కలు.. రేపు మరోటి? ఇప్పటికైనా అందరూ గొంతెత్తండి. ఎందుకంటే పాపం వాటికి నోరు లేదు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి’’ అంటూ రితికా సజ్దే తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
కాగా దేశ రాజధాని ప్రాంతంలో ఇటీవలి వీధి కుక్కల వరుస దాడుల వల్ల పసిపిల్లలు, వృద్ధులు పడుతున్న బాధలు, రేబిస్ బారిన పడి మరణించిన వ్యక్తుల గురించి మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. వీటిని సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి.. 8 వారాల్లోపు వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రజల మేలు కోసమే..
అంతేకాదు.. ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే జంతు ప్రేమికులుగా చెప్పుకొనే వాళ్లు కూడా తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదని హెచ్చరించింది. ప్రజల మేలు కోసం చేసే పనులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నోరులేని మూగజీవాల పట్ల ఇంత కఠినంగా ఉండవద్దని న్యాయస్థానానికి విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో రితికా సజ్దే సైతం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది.