శతక్కొట్టిన హర్షిత్‌ చౌదరి.. బోణీ కొట్టిన వరంగల్‌ | Harshith Chowdary Hits Century in TG20 2026 as Warangal Warriors Beat Khammam Aces | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన హర్షిత్‌ చౌదరి.. బోణీ కొట్టిన వరంగల్‌

Jun 24 2026 5:28 PM | Updated on Jun 24 2026 6:39 PM

TG20 League 2026: Warangal Warriors Harshit Choudhary Slams 48 Ball 100

PC: TG20 League X

తెలంగాణ టీ20 లీగ్‌-2026 (టీజీ20)లో మూడో శతకం నమోదైంది. వరంగల్‌ వారియర్స్‌ ఓపెనర్‌ హర్షిత్‌ చౌదరి శతక్కొట్టాడు. ఖమ్మం ఏసెస్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో 48 బంతుల్లో హర్షిత్‌ వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో తొ మ్మిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

వరంగల్‌కు తొలుత ఓటమి
కాగా జూన్‌ 21న టీజీ20 లీగ్‌ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్‌ వారియర్స్‌ కెప్టెన్‌ అమన్‌ రావు లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఉప్పల్‌ వేదికగా సోమవారం మెదక్‌ ఫాల్కన్స్‌పై 32 బంతుల్లోనే శతక్కొట్టాడు.

తద్వారా లీగ్‌లో మొట్టమొదటి సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు ఈ కరీంనగర్‌ అబ్బాయి. అయితే, ఆ వెంటనే మెదక్‌ సారథి తిలక్‌ వర్మ కూడా సెంచరీ చేసి.. లీగ్‌లో రెండో శతకం నమోదు చేయడంతో పాటు.. వరంగల్‌పై తన జట్టుకు విజయం అందించాడు.

ఖమ్మం స్కోరు 202
తాజాగా తమ రెండో మ్యాచ్‌లో భాగంగా ఖమ్మం ఏసెస్‌ను ఎదుర్కొన్న వరంగల్‌.. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఖమ్మం బ్యాటర్లలో మయాంక్‌ గుప్త (54), మికిల్‌ జైస్వాల్‌ (54) అర్ధ శతకాలతో రాణించారు.

చెలరేగిన హర్షిత్‌.. వరంగల్‌ బోణీ
వరంగల్‌ బౌలర్లలో మహ్మద్‌ అబ్దుల్‌ మాలిక్‌, అభిషేక్‌ చెరో మూడు వికెట్లు కూల్చగా.. క్రాంతి పల్లెపాటి రెండు, హుసేన్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్‌ ఆదిలోనే కెప్టెన్‌ అమన్‌రావు (7) వికెట్‌ కోల్పోగా.. మరో ఓపెనర్‌ హర్షిత్‌ చౌదరి శతకంతో చెలరేగాడు. 

మొత్తంగా 62 బంతులు ఎదుర్కొన్న హర్షిత్‌ పదకొండు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో రిషికేత్‌ సిసోడియా (27) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. 

ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో వరంగల్‌ను విజయతీరాలకు చేర్చాడు హర్షిత్‌ చౌదరి. ఫలితంగా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వరంగల్‌.. ఖమ్మంపై ఐదు వికెట్ల తేడాతో (208-5) విజయం సాధించింది.

ఇక సీజన్‌లో వరంగల్‌కు ఇదే తొలి గెలుపు. టీమిండియా స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌ వరంగల్‌ జట్టుతో పాటు స్టేడియానికి వచ్చినప్పటికీ.. అతడు విశ్రాంతి తీసుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో వరంగల్‌ తరఫున సిరాజ్‌ బరిలో దిగనున్నాడు.

చదవండి: డ్రెసింగ్‌ రూమ్‌లోకి వైభవ్‌కి నో ఎంట్రీ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement