యు ముంబాపై తెలుగు టైటాన్స్‌ గెలుపు | Telugu Titans win over U Mumba | Sakshi
Sakshi News home page

యు ముంబాపై తెలుగు టైటాన్స్‌ గెలుపు

Nov 29 2024 4:30 AM | Updated on Nov 29 2024 4:30 AM

Telugu Titans win over U Mumba

నోయిడా: స్టార్‌ రెయిడర్‌లు ఆశిష్‌ కుమార్, విజయ్‌ చెరో 10 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఓడిన టైటాన్స్‌... గురువారం జరిగిన పోరులో 41–35 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్‌ యు ముంబాపై ఘనవిజయం సాధించింది. 

అటు రెయిడింగ్, ఇటు డిఫెన్స్‌లో ఆకట్టుకున్న తెలుగు టైటాన్స్‌ జట్టు ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్‌ చేసి సత్తా చాటగా... యు ముంబా జట్టు టైటాన్స్‌ను ఒకేసారి ఆలౌట్‌ చేయగలిగింది. తాజా లీగ్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌ 9 విజయాలు, 5 పరాజయాలతో 48 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. 

మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 46 పాయింట్లతో ఉన్న యు ముంబా మూడో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 33–29తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది.  నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్‌ (రాత్రి 8 గంటలకు), గుజరాత్‌ జెయింట్స్‌తో పుణేరి పల్టన్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.   
 

Advertisement
 
Advertisement
Advertisement