తెలుగు టైటాన్స్‌ దూకుడు | Telugu Titans win over U Mumba | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్‌ దూకుడు

Nov 21 2024 3:58 AM | Updated on Nov 21 2024 3:58 AM

Telugu Titans win over U Mumba

యు ముంబాపై ఘనవిజయం

నోయిడా: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో ఏడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో ‘టేబుల్‌ టాపర్‌’ హరియాణా స్టీలర్స్‌ను మట్టికరిపించిన టైటాన్స్‌... తాజాగా పట్టికలో రెండో స్థానంలో ఉన్న యు ముంబాను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్‌ 31–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్‌ యు ముంబాపై గెలుపొందింది.

 చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టైటాన్స్‌ జట్టు రెయిడింగ్‌లో విఫలమైనా... డిఫెన్స్‌లో రాణించింది. టైటాన్స్‌ తరఫున ఆశిష్‌ నర్వాల్‌ 8 పాయింట్లు సాధించగా... సాగర్‌ నర్వాల్, అజిత్‌ పవార్, మన్‌జీత్‌ తలా 4 పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున రోహిత్‌ 8 పాయింట్లు, మన్‌జీత్‌ 7 పాయింట్లతో పోరాడారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో టైటాన్స్‌ 12 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... యు ముంబా 18 పాయింట్లు సాధించింది. 

లీగ్‌లో 11 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌ 7 విజయాలు, 4 పరాజయాలతో 37 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు యు ముంబా 12 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 

దబంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 39–39తో ‘టై’గా ముగిసింది. నేడు బెంగాల్‌ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  

Advertisement
 
Advertisement
Advertisement