తెలంగాణ టీ20 లీగ్-2026లో హైదరాబాద్ ఇ- ఛాంపియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా ఇవాళ (జూన్ 23) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ట్రయికర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన హైదరాబాద్.. పాలమూరు జట్టును 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ చేసింది. అనుముల విఘ్నేశ్ రెడ్డి (30), రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్‌వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ చెరో రెండు, శ్రీనికేత్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 35 పరుగులు చేసి శుభారంభం అందించగా.. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేశ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. పాలమూరు బౌలర్లలో రిషబ్ బస్లాస్ 2, రవి కిరణ్ ఓ వికెట్ తీశారు.


