సెమీస్‌ బెర్త్‌ లక్ష్యంగా... | Team India will face South Africa on Sunday in the T20 World Cup | Sakshi
Sakshi News home page

సెమీస్‌ బెర్త్‌ లక్ష్యంగా...

Jun 21 2026 3:30 AM | Updated on Jun 21 2026 3:30 AM

Team India will face South Africa on Sunday in the T20 World Cup

నేడు దక్షిణాఫ్రికాతో భారత మహిళల పోరు

జోరు మీదున్న స్మృతి, దీప్తి, శ్రీచరణి

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

మాంచెస్టర్‌: వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు టి20 ప్రపంచకప్‌లో కీలక పోరుకు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై అలవోక విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గ్రూప్‌–1లో ఆ్రస్టేలియా మూడు విజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... భారత్‌ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒక గ్రూప్‌ నుంచి రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు చేరనుండటంతో ఈ మ్యాచ్‌ ఫలితం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

సఫారీలపై విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్లో దాదాపుగా అడుగు పెట్టినట్లే. దీంతో హర్మన్‌ బృందం సమష్టిగా సత్తా చాటాలని భావిస్తోంది.  గత రెండు మ్యాచ్‌ల్లో బలహీన ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన హర్మన్‌ బృందం... సఫారీలపై ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరం. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఫుల్‌ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. 

మరోవైపు టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్‌ ఫేవరెట్‌లలో ఒకటిగా కనిపించిన దక్షిణాఫ్రికా జట్టు మైదానంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతోంది. మాంచెస్టర్‌ మైదానంలో గత రెండు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు విజయాలు సాధించగా... మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. ఆదివారమే జరగనున్న మరో మ్యాచ్‌లో శ్రీలంకతో వెస్టిండీస్‌ తలపడనుంది. 

సఫారీలతో అంత సులువు కాదు... 
గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా... ఇప్పుడు టి20ల్లో వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించాలని పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్లే తొలి రెండు మ్యాచ్‌ల్లో మనవాళ్లు ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రెండు అర్ధశతకాలతో స్మృతి ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తుండగా... ఆమెకు సహచరుల నుంచి చక్కటి సహకారం లభిస్తోంది. 

అయితే షఫాలీ వర్మ, జెమీమా, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌ నిలకడ కనబర్చాల్సిన అవసరముంది. దక్షిణాఫ్రికా జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్న నేపథ్యంలో... మరింత అప్రమత్తత అవసరం. బౌలింగ్‌లో భారత జట్టుకు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్నే అమలు చేయొచ్చు. పాకిస్తాన్‌తో పోరులో ఐదు వికెట్లతో సత్తాచాటిన సీనియర్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మతో పాటు ఆంధ్ర అమ్మాయి శ్రీచరణిపై భారీ అంచనాలు ఉన్నాయి.

200
భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఇది 200వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ కానుంది. తద్వారా ఈ మైలురాయి అందుకోనున్న తొలి క్రికెటర్‌గా (పురుషులు/మహిళలు) హర్మన్‌ చరిత్ర సృష్టించనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement