
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ ఇంట్లో చోరీ జరిగింది. అగ్రాలోని దీప్తీకి చెందిన ఫ్లాట్ నుంచి విలువైన వస్తువులను ఢిల్లీ ఉమెన్స్ క్రికెటర్ ఆరుషి గోయల్ దొంగతనం చేసినట్లు ఆమె సోదరుడు సుమిత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇండియన్ రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్న ఆరుషి.. మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ తరపున దీప్తీతో కలిసి ఆడింది. అదేవిధంగా దీప్తీని ఆరుషి రూ.25 లక్షలు మోసం చేసిందని సుమిత్ శర్మ ఆరోపించాడు.
"తన సోదరి ఇంట్లో దొంగతనం జరిగిందని దీప్తీ సోదరుడు సుమిత్ శర్మ అగ్రాలోని సదర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. ప్రాథమిక విచారణ అనంతరం మేము పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశాము. అరుషి, దీప్తీ కలిసి ఒకే జట్టుకు ఆడడం ఇద్దరూ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
ఈ క్రమంలో ఆరుషీ కుటుంబ అత్యవసర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను చూపుతూ దీప్తీ నుంచి పలుమార్లు నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మేము పూర్తి స్దాయి విచారణ జరుపుతామని" ఏసీపీ (ఆగ్రా సదర్), సుకన్య శర్మ తెలిపినట్లు టైమ్స్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
దీప్తీ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతోంది. ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు ప్రకటించిన భారత జట్టులో ఆమె సభ్యురాలిగా ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా హర్మాన్ ప్రీత్ సేన ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.
చదవండి: పుజారా ఆల్‌టైమ్ భారత జట్టు ఇదే.. రోహిత్, పంత్‌కు నో ఛాన్స్?