గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పైచేయి సాధించింది. 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని, 170 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (7) రిటైర్డ్ హర్ట్ కాగా.. ఆయుశ్ పాండే, దేవ్‌దత్ పడిక్కల్ తలో 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
నిప్పులు చెరిగిన నబీ
శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. పేసర్ అకిబ్ నబీ (4-58) నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాటర్ల భరతం పట్టాడు. మిగతా పేసర్లు యశ్ ఠాకూర్ (2-51), అన్షుల్ కంబోజ్ (1-43) కూడా సత్తా చాటారు. స్పిన్నర్లు హర్ష్ దూబే (2-84), సరాన్ష్ జైన్ (1-83) కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. లంక ఇన్నింగ్స్‌లో నువనిదు ఫెర్నాండో (84), అషేన్ బండార (70), కెప్టెన్ సహాన్ అరాచ్చిగే (72) అర్ద సెంచరీలతో రాణించారు.
సాయి సుదర్శన్, జురెల్ శతకాలు
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సాయి సుదర్శన్ (132), కెప్టెన్ ధృవ్ జురెల్ (141 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 6 వికెట్ల నష్టానికి 452 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మిగతా బ్యాటర్లలో షేక్ రషీద్ (63) అర్ద సెంచరీతో రాణించగా.. ఆయుశ్ పాండే 25, పడిక్కల్ 12, రుతురాజ్ 22, హర్ష్ దూబే 30, సరాన్ష్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో గుణశేఖర 3, సుధీర 2, రవిందు ఓ వికెట్ తీశారు.


