
ఆర్టీఐ పరిధిలోకి రాకుండా క్రీడా బిల్లు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ (ఎన్‌ఎస్‌జీబీ)లో కొత్త సవరణను చేర్చింది. ఇప్పటి వరకు ఉన్న బిల్లులో ‘గుర్తింపు పొందిన ఏ క్రీడా సంఘమైనా ప్రజలకు చెందినదే. తమ విధులు, అధికారాలు నిర్వహించే విషయంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ )–2005 పరిధిలోకే అది వస్తుంది’ అని స్పష్టంగా ఉంది.
అయితే దీనిపై బీసీసీఐ చాలా కాలంగా తమ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇతర క్రీడా సంఘాల తరహాలో తాము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదని, బోర్డు ఆర్టీఐ పరిధిలోకి రాదని చెబుతూ వచ్చింది. చివరకు బోర్డు ఆశించిన ప్రకారం వారికి ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం కొత్త బిల్లులో సవరణను జోడించింది. దీని ప్రకారం ‘ప్రభుత్వం నుంచి నిధులు, సహాయం పొందే క్రీడా సంఘాలకే ఆర్టీఐ నిబంధన వర్తిస్తుంది. అలా ఆర్థిక సహకారం తీసుకుంటేనే దానిని ప్రజా సంస్థగా గుర్తిస్తారు’ అని స్పష్టతనిచ్చింది.
తాజా సవరణ నేపథ్యంలో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తూ సామాన్యులు ఎవరైనా బీసీసీఐని ప్రశ్నించడానికి లేదా వారి కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు కోరడానికి గానీ అవకాశం లేదు. ‘తాజా బిల్లులో ఇది ఒక సమస్యగా కనిపించింది. ఆర్థిక సహకారం తీసుకోవడం లేదనే కారణం చూపించి ఈ బిల్లు ఆమోదం కాకుండా పార్లమెంట్‌లో అడ్డుకునే అవకాశం ఉండేది. లేదా ఇదే కారణంతో బీసీసీఐ కోర్టుకెక్కేది కూడా. అందుకే సవరణ చేయాల్సి వచ్చింది’ అని కేంద్ర క్రీడాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
అయితే ఆర్టీఐ పరిధిలోకి రాకపోయినా... కొన్ని ఇతర నిబంధనలు బీసీసీఐని కూడా ప్రభుత్వం ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది చట్టంగా మారితే బీసీసీఐ కూడా వెంటనే జాతీయ క్రీడా సమాఖ్యగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్ క్రీడగా మారనుండటం దీనికి ఒక కారణం. కొత్త బిల్లు ప్రకారం నిధులు పొందకపోయినా... వ్యవస్థ నడిచేందుకు ఇతర రూపాల్లో సహాయ సహకారాలు తీసుకుంటుంది కాబట్టి జవాబుదారీతనం ఉండాల్సిందే.
పైగా బీసీసీఐ కూడా నేషనల్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ (ఎన్‌ఎస్‌టీ) పరిధిలోకి వస్తుంది. క్రీడా సంఘాల్లో ఎన్నికల నుంచి ఆటగాళ్ల ఎంపిక వరకు ఏదైనా వివాదం వస్తే ఎన్‌సీటీ పరిష్కరిస్తుంది. ట్రైబ్యునల్ తీర్పులను సుప్రీం కోర్టులో మాత్రమే సవాల్ చేసే అవకాశం ఉంది.