breaking news
sports bill
-
జాతీయ క్రీడా పాలన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: దేశ క్రీడా పరిపాలన వ్యవస్థను సమూలంగా మార్చడంతో పాటు... క్రీడా రంగానికి మరింత చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జాతీయ క్రీడా పాలన చట్టం–2025’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో బిల్లు చట్టంగా మారిందని... ఇది దేశ క్రీడారంగంలో విప్లవాత్మక సంస్కరణ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ‘ఆగస్టు 18న జాతీయ క్రీడా పాలన చట్టం–2025కు రాష్ట్రపతి ఆమోదం లభించింది’ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత నెల 23న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా... ఈ నెల 11న ఆమోదం పొందింది. ఈ నెల 12న రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లుకు కొన్ని సవరణల అనంతరం ఉభయసభలు ఆమోదించాయి. దీంతో ప్రభుత్వ నిధులపై ఆధారపడే క్రీడా సంస్థలు మాత్రమే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రానున్నాయి. మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్టీఐ పరిధిలోకి రాదు. -
6 నెలల్లో క్రీడా బిల్లు అమలు
న్యూఢిల్లీ: రాబోయే ఆరు నెలల్లో జాతీయ క్రీడా బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు ఆమోద ముద్ర లభించడంతో... ప్రపంచంలో క్రీడా చట్టం అమల్లోకి వచ్చిన 21వ దేశంగా భారత్ నిలిచింది. ఈ బిల్లు అమలుతో దేశ క్రీడారంగానికి ఎంతో లబ్ధి చేకూరనుంది. మౌలిక వసతులు మెరుగు పడటంతో పాటు... క్రీడల్లో పారదర్శకత పెరగనుంది. పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం క్రీడా మంత్రి దీనిపై స్పందిస్తూ... ఇప్పటికే నియమ నిబంధనల రూపకల్పన ప్రారంభమైందని వెల్లడించారు. ‘ఈ బిల్లు వీలైనంత త్వరగా అమల్లోకి వస్తుంది. రాబోయే ఆరు నెలల్లో వంద శాతం దీన్ని అమలు చేసే విధంగా విధివిధానాలు రూపొందిస్తున్నాం. దీనివల్ల క్రీడారంగానికి ఇతోధిక లబ్ధి చేకూరుతుంది. భారత అథ్లెట్లు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గేనే సమయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాకపోతే జాతీయ విధానానికి అనుగుణంగా కొన్ని సూచనలు ఉంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని వినియోగిస్తారు. అవసరమైన పోస్టుల సృష్టి, పరిపాలనా అనుమతుల వంటి వాటి ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ), జాతీయ క్రీడా ట్రైబ్యునల్ (ఎన్ఎస్టీ)కు విధానపరమైన అనుమతులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం’ అని మాండవీయ పేర్కొన్నారు. స్వతంత్ర భారత దేశంలో క్రీడా రంగంలో ఇది అతిపెద్ద సంస్కరణ అని క్రీడా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వానికి సర్వాధికారాలు... బిల్లు ఆమోదంతో అంతర్జాతీయ ఈవెంట్లలో భారత అథ్లెట్లు పాల్గొనడంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభించింది. గతంలోనూ ఇదే పద్ధతి కొనసాగినా... దానికంటూ ప్రత్యేకమైన విధానం లేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో క్రీడల్లో పోటీపడాల్సి వచ్చిన సందర్భంతో పాటు దౌత్యపరంగా సఖ్యతగా లేని మరే దేశంలో పర్యటించాల్సి వచ్చినా... ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా క్రీడా చట్టం అమలవుతున్న దేశాల్లో... అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే అంశంపై ఆయా దేశాల ప్రభుత్వాలదే తుది నిర్ణయం. ఇది కేవలం అసాధారణ పరిస్థితుల కోసం ఉద్దేశించి రూపొందించింది... అంతే తప్ప జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం కోసం తీసుకొచ్చింది కాదు. జాతీయ భద్రతా బెదిరింపులు, దౌత్య బహిష్కరణలు లేదా ప్రపంచ అత్యవసర పరిస్థితులు వంటివి సంభవించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. 2008 ముంబై దాడుల సమయం నుంచే పాకిస్తాన్‌తో భారత పురుషుల క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య ప్రధాన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. ఆయా సమయాల్లో విదేశాంగ శాఖ అనుమతులతోనే టీమిండియా మ్యాచ్‌లు ఆడుతోంది. ఇకపై కూడా ఈ విధానమే కొనసాగుతుంది’ అని కేంద్ర మంత్రి చెప్పారు. సుదీర్ఘ చర్చల తర్వాతే... ఈ బిల్లు ద్వారా జాతీయ క్రీడా సమాఖ్యలు, జాతీయ క్రీడా ట్రైబ్యునల్, జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్ ఇలా అన్నింటిని జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ) పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. దీంతో క్రీడల్లో పారదర్శకత పెరగడంతో పాటు వివాద పరిష్కారం మరింత సులువు కానుంది. ఆరంభంలో ఈ బిల్లుపై అవగాహన కొరవడినా... ఆ తర్వాత జాతీయ క్రీడా సమాఖ్యలు, అథ్లెట్లు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దీనికి మద్దతునిచ్చాయని క్రీడా శాఖ మంత్రి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలతో చర్చించి విశ్లేషించి 60 రౌండ్లకు పైగా ‘చింతన్ శిబిర్’లను నిర్వహించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరమే బిల్లును పార్లమెంట్ ముందుంచినట్లు క్రీడా మంత్రి వెల్లడించారు. కొత్త చట్టంతో దేశ క్రీడా రంగం పురోగతి సాధిస్తుందనే నమ్మకముందన్న మాండవీయ... రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్‌ను క్రీడల్లో సూపర్ పవర్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ... ‘జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులతో రోజుల తరబడి మాట్లాడిన తర్వాతే ఈ బిల్లును రూపొందించాం. అథ్లెట్లు, కోచ్‌లు, క్రీడా విశ్లేషకులు, నిపుణులు ఇలా ఒక్కరేంటి అందరీని సంప్రదించాం. బిల్లులోని ప్రతి నిబంధనను వారికి వివరించాం. వాటి అవసరమేంటో స్పష్టంగా చెప్పిన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఎలాంటి బిల్లు కావాలో వారినే అడిగాం. వారిచ్చిన సూచనలు సలహాలతో పాటు సుప్రీం కోర్టు, హైకోర్టుల్లోని క్రీడా న్యాయవాదుల నుంచి కూడా సలహాలు తీసుకున్నాం. వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్నాం. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ముసాయిదా క్రీడా బిల్లును రూపొందించింది. కానీ దాన్ని అమలు చేయలేకపోయింది’అని క్రీడా శాఖమంత్రి వెల్లడించారు. అథ్లెట్లతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే క్రీడా సమాఖ్యల్లో వారి ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ‘మహిళా అథ్లెట్ల ప్రాతినిధ్యం పెంచాం. ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీలో నలుగురు మహిళా అథ్లెట్లు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో ‘స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ’’ని కూడా తీసుకొస్తాం. ఇది అంతర్జాతీయ టోర్నీల్లో మన అథ్లెట్లు పతకాలు సాధించేందుకు రోడ్‌మ్యాప్‌లా నిలవనుంది’ అని మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు. -
పార్లమెంట్లో క్రీడా బిల్లు పాస్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో జాతీయ క్రీడా బిల్లు పాసయ్యింది. సోమవారం లోక్‌సభ ఆమోదించిన బిల్లును 24 గంటల్లోనే మోదీ సర్కారు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును ఎగువ సభ ఆమోదించింది. అలాగే సవరించిన జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ రెండు బిల్లులను రాష్ట్రపతి నోటిఫై చేయగానే చట్టంగా మారతాయి. రాజ్యసభలో బిహార్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సభలో మాట్లాడుతూ ‘20 దేశాల్లో క్రీడా చట్టం అమలవుతోంది. ఈ 21వ శతాబ్దిలో మన దేశంలో క్రీడా చట్టం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం’ అని అన్నారు. అనంతరం బిల్లుపై దాదాపు 2 గంటలకు పైగానే చర్చ జరిగింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష తదితరులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం క్రీడారంగంలో పారదర్శకత పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందడం పట్ల కేంద్ర క్రీడాశాఖ మంత్రి మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. చట్టరూపం దాల్చనున్న బిల్లు స్వరూపమిది... » ఈ బిల్లులో అత్యంత కీలకమైంది జాతీయ క్రీడల బోర్డు (ఎన్ఎస్బీ) ఏర్పాటు. జాతీయ సమాఖ్యలకు గుర్తింపు, లేదంటే రద్దులాంటి విశేషాధికారాలు బోర్డుకు ఉంటాయి. సకాలంలో ఎన్నికలు, సక్రమంగా జట్ల ఎంపికలు చేసేలా చూస్తుంది. బోర్డు గుర్తించిన సమాఖ్యలకే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. » కొత్త బిల్లు ప్రకారం జాతీయ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ కూడా ఏర్పాటు అవుతుంది. సమాఖ్యలో కుమ్ములాటలు, జట్ల ఎంపికల్లో వివాదాలను పరిష్కరించే అధికారం ఈ ట్రైబ్యునల్‌కే కల్పించారు. ఈ ట్రైబ్యునల్ తీర్పులపై కేవలం సుప్రీం కోర్టులోనే సవాలు చేసే అవకాశముంటుంది. దిగువ కోర్టుల్లో ఇకమీదట కేసుల విచారణ ఉండదు. » క్రీడా పాలకులు ఏళ్లతరబడి తిష్టవేసేందుకు వీలుండదు. అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు గరిష్టంగా 12 ఏళ్ల పాటు పదవుల్లో కొన సాగవచ్చు. కాగా గరిష్ట వయసును 70 నుంచి 75కు పెంచారు. అయితే సదరు సమాఖ్యకు సంబంధించిన అంతర్జాతీయ సమాఖ్య నియమావళికి లోబడే ఈ పరిమితి ఉంటుంది. -
బీసీసీఐ సమాచారం ఇవ్వనవసరం లేదు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ (ఎన్ఎస్జీబీ)లో కొత్త సవరణను చేర్చింది. ఇప్పటి వరకు ఉన్న బిల్లులో ‘గుర్తింపు పొందిన ఏ క్రీడా సంఘమైనా ప్రజలకు చెందినదే. తమ విధులు, అధికారాలు నిర్వహించే విషయంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ )–2005 పరిధిలోకే అది వస్తుంది’ అని స్పష్టంగా ఉంది. అయితే దీనిపై బీసీసీఐ చాలా కాలంగా తమ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇతర క్రీడా సంఘాల తరహాలో తాము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదని, బోర్డు ఆర్టీఐ పరిధిలోకి రాదని చెబుతూ వచ్చింది. చివరకు బోర్డు ఆశించిన ప్రకారం వారికి ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం కొత్త బిల్లులో సవరణను జోడించింది. దీని ప్రకారం ‘ప్రభుత్వం నుంచి నిధులు, సహాయం పొందే క్రీడా సంఘాలకే ఆర్టీఐ నిబంధన వర్తిస్తుంది. అలా ఆర్థిక సహకారం తీసుకుంటేనే దానిని ప్రజా సంస్థగా గుర్తిస్తారు’ అని స్పష్టతనిచ్చింది. తాజా సవరణ నేపథ్యంలో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తూ సామాన్యులు ఎవరైనా బీసీసీఐని ప్రశ్నించడానికి లేదా వారి కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు కోరడానికి గానీ అవకాశం లేదు. ‘తాజా బిల్లులో ఇది ఒక సమస్యగా కనిపించింది. ఆర్థిక సహకారం తీసుకోవడం లేదనే కారణం చూపించి ఈ బిల్లు ఆమోదం కాకుండా పార్లమెంట్లో అడ్డుకునే అవకాశం ఉండేది. లేదా ఇదే కారణంతో బీసీసీఐ కోర్టుకెక్కేది కూడా. అందుకే సవరణ చేయాల్సి వచ్చింది’ అని కేంద్ర క్రీడాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఆర్టీఐ పరిధిలోకి రాకపోయినా... కొన్ని ఇతర నిబంధనలు బీసీసీఐని కూడా ప్రభుత్వం ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది చట్టంగా మారితే బీసీసీఐ కూడా వెంటనే జాతీయ క్రీడా సమాఖ్యగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్ క్రీడగా మారనుండటం దీనికి ఒక కారణం. కొత్త బిల్లు ప్రకారం నిధులు పొందకపోయినా... వ్యవస్థ నడిచేందుకు ఇతర రూపాల్లో సహాయ సహకారాలు తీసుకుంటుంది కాబట్టి జవాబుదారీతనం ఉండాల్సిందే. పైగా బీసీసీఐ కూడా నేషనల్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ (ఎన్ఎస్టీ) పరిధిలోకి వస్తుంది. క్రీడా సంఘాల్లో ఎన్నికల నుంచి ఆటగాళ్ల ఎంపిక వరకు ఏదైనా వివాదం వస్తే ఎన్సీటీ పరిష్కరిస్తుంది. ట్రైబ్యునల్ తీర్పులను సుప్రీం కోర్టులో మాత్రమే సవాల్ చేసే అవకాశం ఉంది. -
కొత్త క్రీడా బిల్లులో ఏమున్నాయంటే...
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.... భారత ప్రభుత్వం కొత్త క్రీడా బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం లోక్‌సభలో ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు’ను ప్రవేశ పెట్టారు. నేషనల్ స్పోర్ట్స్ బోర్డు, నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్, నేషనల్ స్పోర్ట్స్ ఎలక్షన్ ప్యానెల్, సమాచార హక్కు చట్టం అమలు, ప్రభుత్వ విచక్షణాధికారాలు, వయో పరిమితికి సంబంధించిన నిబంధనలు, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు–2025 ఇలా అందులోని కొన్ని కీలక అంశాలు ఇవి... » జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ)కు ఓ చైర్పర్సన్ ఉండనున్నాడు. అతడిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సామర్థ్యం, సమగ్రత, అర్హత ప్రతిపాదికన బోర్డు సభ్యుల ఎంపిక జరుగుతుంది. క్రీడలపై అవగాహనతో పాటు పాలన అనుభవం ఉన్న వ్యక్తులకు పెద్దపీట వేయనుంది. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం సెలక్షన్ కమిటీ సిఫార్సులతో ఈ నియమకాలు జరుగుతాయి. » సెలక్షన్ కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ లేదా కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి, జాతీయ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జనరల్ చైర్ పర్సన్ అవుతారు. ఇందులో జాతీయ క్రీడా సంఘాలకు అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు క్రీడా నిర్వాహకులతో పాటు ఖేల్‌రత్న, ద్రోణాచార్య, అర్జున అవార్డు పొందిన ఓ ప్రముఖ క్రీడాకారుడు ఉంటాడు. » భారత ఎన్నికల సంఘం మాజీ సభ్యులు లేదా రాష్ట్రాల మాజీ ప్రధాన ఎన్నికల అధికారులతో కూడిన జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్‌ను కూడా ఈ బిల్లు అందించనుంది. ఈ ప్యానెల్ జాతీయ క్రీడా సంస్థల కార్యనిర్వాహక కమిటీలు, అథ్లెట్ల కమిటీకి ఎన్నికలు నిర్వహించనుంది. » క్రీడల్లో డోపింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో... సమగ్ర ప్రక్షాళనకు కేంద్ర నడుం బిగించింది. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు–2025 ప్రకారం క్రీడా కార్యకలాపాలు, దర్యాప్తులకు సంబంధించిన నిర్ణయాల్లో స్వయంప్రతిపత్తి ఉంటుంది. » సివిల్ కోర్టుకు ఉండే అన్నీ అధికారాలు గల జాతీయ క్రీడా ట్రిబ్యునల్ ప్రతిపాదన కూడా బిల్లులో ఉంది. ఇది వేర్వేరు క్రీడాంశాల్లో ప్లేయర్ల ఎంపికల నుంచి మొదలుకొని... సంఘాల ఎన్నికలు, వాటి వివాదాలను పరిష్కరించనుంది. ఇది అమల్లోకి వచ్చాక కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఈ నిర్ణయాలను సవాలు చేసే అధికారం ఉండనుంది. » క్రీడా మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం... ప్రస్తుతం క్రీడా రంగానికి సంబంధించిన 350 కేసులు వేర్వేరు న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి. జాతీయ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ప్రారంభమైతే... అథ్లెట్లకు ఎంతో ఉపకరించనుంది. » జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు–2025ను సైతం కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సూచించిన మార్పులను ఇందులో పొందుపరిచారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పనితీరులో ప్రభుత్వాల జోక్యం అధికంగా ఉండటంపై ‘వాడా’ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. » 2022లో ఈ చట్టాన్ని ఆమోదించారు. అయితే ‘వాడా’ లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా దాని అమలును నిలిపి వేయాల్సి వచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన చైర్పర్సన్, ఇద్దరు సభ్యులతో కూడిన బోర్డు... ‘నాడా’ను పర్యవేక్షించేది. అయితే స్వయం ప్రతిపత్తి గల సంస్థలో ప్రభుత్వ జోక్యాన్ని ‘వాడా’ తప్పుబట్టింది. -
జాతీయ క్రీడా నియమావళి పరిధిలోకి బీసీసీఐ!
న్యూఢిల్లీ: త్వరలోనే భారత ప్రభుత్వం కొత్త క్రీడా బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇది వరకే జాతీయ క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్) ఉంది. దీనికి కొన్ని సవరణలు, మార్పు–చేర్పులతో తాజాగా స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఇన్నేళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్వతంత్ర క్రీడా సమాఖ్యగా చక్రం తిప్పింది. ఇప్పుడు కొత్త బిల్లు ప్రకారం క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ గవర్నెన్స్ గొడుగు కిందకే రానుంది. ఇదే విషయమై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. ‘దేశంలో ఉన్న అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల మాదిరే బీసీసీఐ కూడా కొత్త గవర్నెన్స్ బిల్లు పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు, గ్రాంట్లు పొందిన, పొందకపోయినా పార్లమెంటులో చట్టం అయ్యాక క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ కోడ్ కిందకే వస్తుంది’ అని క్రీడాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. క్రీడా సమఖ్యల లాగే క్రికెట్ బోర్డుకు ఉన్న స్వయంప్రతిపత్తికి ఎలాంటి విఘాతం కలుగదని, అయితే వివాదాలు, ఇతరాత్ర సమస్యలు ఎదురైతే మాత్రం జాతీయ క్రీడా నియమావళి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్–2028లో క్రికెట్ క్రీడాంశం ఉండటంతోనే బోర్డు ఒలింపిక్ సంఘం పరిధిలోకి వచ్చినట్లయ్యింది. జాతీయ క్రీడాసమాఖ్యల్లో నిర్లిప్తతను దూరం చేసి జవాబుదారితనాన్ని మరింత పెంచేందుకు, సకాలంలో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు, పారదర్శక పరిపాలన, అర్హులైన క్రీడాకారుల సంక్షేమం, ప్రమాణాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును తీసుకొస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఒలింపిక్ చార్టర్ ప్రకారం నడుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ బిల్లు తెలియజేస్తుంది. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన మోదీ సర్కారు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు సిద్ధమైంది. ఇది వరకటి స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 70 ఏళ్ల వయసుకు చేరిన ఏ కార్యవర్గ సభ్యుడైనా పదవికి రాజీనామా చేయాల్సివుండగా... ఈ గరిష్ట వయోపరిమితి ఇక మీదట 75కు చేరే అవకాశముంది. బిల్లు పాసయితే... కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అపెక్స్ కమిటీ రూపుదిద్దుకుంటుంది. ఈ కమిటీలో కేబినెట్ కార్యదర్శి హోదా ఉన్న అధికారి లేదంటే క్రీడా శాఖ కార్యదర్శి, స్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ చైర్ పర్సన్ అవుతారు. క్రీడలకు సేవలిందించిన దిగ్గజ క్రీడాకారులు, కోచ్‌లు సభ్యులుగా ఉంటారు. వీరు తప్పనిసరిగా ద్రోణాచార్య, ఖేల్‌రత్న, అర్జున అవార్డీలై ఉండాలి. జాతీయ క్రీడా సమాఖ్యలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులకు ఈ కమిటీలో చోటుంటుంది. ముఖ్యంగా తరచూ వివాదాస్పదమవుతున్న అంశాలపై మరింత జవాబుదారీతనంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది. ఎంపికల ప్రక్రియ, ఆటగాళ్ల నిషేధం ఇతరాత్ర సమస్యల్ని ఈ కమిటీ పారదర్శక విధానంతో పరిష్కరిస్తుంది.