
విధివిధానాల రూపకల్పన ప్రారంభం
మౌలిక సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి
క్రీడారంగంలో పారదర్శకతకు పెద్దపీట
కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడి
న్యూఢిల్లీ: రాబోయే ఆరు నెలల్లో జాతీయ క్రీడా బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు ఆమోద ముద్ర లభించడంతో... ప్రపంచంలో క్రీడా చట్టం అమల్లోకి వచ్చిన 21వ దేశంగా భారత్ నిలిచింది. ఈ బిల్లు అమలుతో దేశ క్రీడారంగానికి ఎంతో లబ్ధి చేకూరనుంది. మౌలిక వసతులు మెరుగు పడటంతో పాటు... క్రీడల్లో పారదర్శకత పెరగనుంది. పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం క్రీడా మంత్రి దీనిపై స్పందిస్తూ... ఇప్పటికే నియమ నిబంధనల రూపకల్పన ప్రారంభమైందని వెల్లడించారు.
‘ఈ బిల్లు వీలైనంత త్వరగా అమల్లోకి వస్తుంది. రాబోయే ఆరు నెలల్లో వంద శాతం దీన్ని అమలు చేసే విధంగా విధివిధానాలు రూపొందిస్తున్నాం. దీనివల్ల క్రీడారంగానికి ఇతోధిక లబ్ధి చేకూరుతుంది. భారత అథ్లెట్లు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గేనే సమయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాకపోతే జాతీయ విధానానికి అనుగుణంగా కొన్ని సూచనలు ఉంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని వినియోగిస్తారు.
అవసరమైన పోస్టుల సృష్టి, పరిపాలనా అనుమతుల వంటి వాటి ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ క్రీడా బోర్డు (ఎన్‌ఎస్‌బీ), జాతీయ క్రీడా ట్రైబ్యునల్ (ఎన్‌ఎస్‌టీ)కు విధానపరమైన అనుమతులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం’ అని మాండవీయ పేర్కొన్నారు. స్వతంత్ర భారత దేశంలో క్రీడా రంగంలో ఇది అతిపెద్ద సంస్కరణ అని క్రీడా మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వానికి సర్వాధికారాలు...
బిల్లు ఆమోదంతో అంతర్జాతీయ ఈవెంట్లలో భారత అథ్లెట్లు పాల్గొనడంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభించింది. గతంలోనూ ఇదే పద్ధతి కొనసాగినా... దానికంటూ ప్రత్యేకమైన విధానం లేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో క్రీడల్లో పోటీపడాల్సి వచ్చిన సందర్భంతో పాటు దౌత్యపరంగా సఖ్యతగా లేని మరే దేశంలో పర్యటించాల్సి వచ్చినా... ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది.
‘ప్రపంచ వ్యాప్తంగా క్రీడా చట్టం అమలవుతున్న దేశాల్లో... అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే అంశంపై ఆయా దేశాల ప్రభుత్వాలదే తుది నిర్ణయం. ఇది కేవలం అసాధారణ పరిస్థితుల కోసం ఉద్దేశించి రూపొందించింది... అంతే తప్ప జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం కోసం తీసుకొచ్చింది కాదు. జాతీయ భద్రతా బెదిరింపులు, దౌత్య బహిష్కరణలు లేదా ప్రపంచ అత్యవసర పరిస్థితులు వంటివి సంభవించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
2008 ముంబై దాడుల సమయం నుంచే పాకిస్తాన్‌తో భారత పురుషుల క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య ప్రధాన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. ఆయా సమయాల్లో విదేశాంగ శాఖ అనుమతులతోనే టీమిండియా మ్యాచ్‌లు ఆడుతోంది. ఇకపై కూడా ఈ విధానమే కొనసాగుతుంది’ అని కేంద్ర మంత్రి చెప్పారు.
సుదీర్ఘ చర్చల తర్వాతే...
ఈ బిల్లు ద్వారా జాతీయ క్రీడా సమాఖ్యలు, జాతీయ క్రీడా ట్రైబ్యునల్, జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్ ఇలా అన్నింటిని జాతీయ క్రీడా బోర్డు (ఎన్‌ఎస్‌బీ) పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. దీంతో క్రీడల్లో పారదర్శకత పెరగడంతో పాటు వివాద పరిష్కారం మరింత సులువు కానుంది. ఆరంభంలో ఈ బిల్లుపై అవగాహన కొరవడినా... ఆ తర్వాత జాతీయ క్రీడా సమాఖ్యలు, అథ్లెట్లు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దీనికి మద్దతునిచ్చాయని క్రీడా శాఖ మంత్రి వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలతో చర్చించి విశ్లేషించి 60 రౌండ్లకు పైగా ‘చింతన్ శిబిర్’లను నిర్వహించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరమే బిల్లును పార్లమెంట్ ముందుంచినట్లు క్రీడా మంత్రి వెల్లడించారు. కొత్త చట్టంతో దేశ క్రీడా రంగం పురోగతి సాధిస్తుందనే నమ్మకముందన్న మాండవీయ... రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్‌ను క్రీడల్లో సూపర్ పవర్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ...
‘జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులతో రోజుల తరబడి మాట్లాడిన తర్వాతే ఈ బిల్లును రూపొందించాం. అథ్లెట్లు, కోచ్‌లు, క్రీడా విశ్లేషకులు, నిపుణులు ఇలా ఒక్కరేంటి అందరీని సంప్రదించాం. బిల్లులోని ప్రతి నిబంధనను వారికి వివరించాం. వాటి అవసరమేంటో స్పష్టంగా చెప్పిన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఎలాంటి బిల్లు కావాలో వారినే అడిగాం. వారిచ్చిన సూచనలు సలహాలతో పాటు సుప్రీం కోర్టు, హైకోర్టుల్లోని క్రీడా న్యాయవాదుల నుంచి కూడా సలహాలు తీసుకున్నాం.
వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్నాం. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ముసాయిదా క్రీడా బిల్లును రూపొందించింది. కానీ దాన్ని అమలు చేయలేకపోయింది’అని క్రీడా శాఖమంత్రి వెల్లడించారు. అథ్లెట్లతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే క్రీడా సమాఖ్యల్లో వారి ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
‘మహిళా అథ్లెట్ల ప్రాతినిధ్యం పెంచాం. ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీలో నలుగురు మహిళా అథ్లెట్లు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో ‘స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ’’ని కూడా తీసుకొస్తాం. ఇది అంతర్జాతీయ టోర్నీల్లో మన అథ్లెట్లు పతకాలు సాధించేందుకు రోడ్‌మ్యాప్‌లా నిలవనుంది’ అని మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు.