
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.... భారత ప్రభుత్వం కొత్త క్రీడా బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం లోక్‌సభలో ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు’ను ప్రవేశ పెట్టారు. నేషనల్ స్పోర్ట్స్ బోర్డు, నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్, నేషనల్ స్పోర్ట్స్ ఎలక్షన్ ప్యానెల్, సమాచార హక్కు చట్టం అమలు, ప్రభుత్వ విచక్షణాధికారాలు, వయో పరిమితికి సంబంధించిన నిబంధనలు, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు–2025 ఇలా అందులోని కొన్ని కీలక అంశాలు ఇవి...
» జాతీయ క్రీడా బోర్డు (ఎన్‌ఎస్‌బీ)కు ఓ చైర్‌పర్సన్ ఉండనున్నాడు. అతడిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సామర్థ్యం, సమగ్రత, అర్హత ప్రతిపాదికన బోర్డు సభ్యుల ఎంపిక జరుగుతుంది. క్రీడలపై అవగాహనతో పాటు పాలన అనుభవం ఉన్న వ్యక్తులకు పెద్దపీట వేయనుంది. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం సెలక్షన్ కమిటీ సిఫార్సులతో ఈ నియమకాలు జరుగుతాయి.
» సెలక్షన్ కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ లేదా కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి, జాతీయ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జనరల్ చైర్ పర్సన్ అవుతారు. ఇందులో జాతీయ క్రీడా సంఘాలకు అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు క్రీడా నిర్వాహకులతో పాటు ఖేల్‌రత్న, ద్రోణాచార్య, అర్జున అవార్డు పొందిన ఓ ప్రముఖ క్రీడాకారుడు ఉంటాడు.
» భారత ఎన్నికల సంఘం మాజీ సభ్యులు లేదా రాష్ట్రాల మాజీ ప్రధాన ఎన్నికల అధికారులతో కూడిన జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్‌ను కూడా ఈ బిల్లు అందించనుంది. ఈ ప్యానెల్ జాతీయ క్రీడా సంస్థల కార్యనిర్వాహక కమిటీలు, అథ్లెట్ల కమిటీకి ఎన్నికలు నిర్వహించనుంది.
» క్రీడల్లో డోపింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో... సమగ్ర ప్రక్షాళనకు కేంద్ర నడుం బిగించింది. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు–2025 ప్రకారం క్రీడా కార్యకలాపాలు, దర్యాప్తులకు సంబంధించిన నిర్ణయాల్లో స్వయంప్రతిపత్తి ఉంటుంది.
» సివిల్ కోర్టుకు ఉండే అన్నీ అధికారాలు గల జాతీయ క్రీడా ట్రిబ్యునల్ ప్రతిపాదన కూడా బిల్లులో ఉంది. ఇది వేర్వేరు క్రీడాంశాల్లో ప్లేయర్ల ఎంపికల నుంచి మొదలుకొని... సంఘాల ఎన్నికలు, వాటి వివాదాలను పరిష్కరించనుంది. ఇది అమల్లోకి వచ్చాక కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఈ నిర్ణయాలను సవాలు చేసే అధికారం ఉండనుంది.
» క్రీడా మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం... ప్రస్తుతం క్రీడా రంగానికి సంబంధించిన 350 కేసులు వేర్వేరు న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి. జాతీయ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ప్రారంభమైతే... అథ్లెట్లకు ఎంతో ఉపకరించనుంది.
» జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు–2025ను సైతం కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సూచించిన మార్పులను ఇందులో పొందుపరిచారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పనితీరులో ప్రభుత్వాల జోక్యం అధికంగా ఉండటంపై ‘వాడా’ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది.
» 2022లో ఈ చట్టాన్ని ఆమోదించారు. అయితే ‘వాడా’ లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా దాని అమలును నిలిపి వేయాల్సి వచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన చైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులతో కూడిన బోర్డు... ‘నాడా’ను పర్యవేక్షించేది. అయితే స్వయం ప్రతిపత్తి గల సంస్థలో ప్రభుత్వ జోక్యాన్ని ‘వాడా’ తప్పుబట్టింది.