
PC: X
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికే పెద్దపీట వేస్తోందని, తద్వారా భారత్‌ను ప్రపంచ టాప్–10 క్రీడా దేశాల్లో నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ‘ప్లేకామ్ బిజినెస్ ఆఫ్ స్పోర్ట్స్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘గతంలో క్రీడా సమాఖ్యల్లో తిష్ట వేసుకు కూర్చున్న సమస్యలు, వివాదాలే పతాక శీర్షికలయ్యేవి.
ప్రస్తుతం మేం ఈ వివాదాలను పక్కనబెట్టి అథ్లెట్ల ప్రదర్శన మెరుగుపర్చడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. అంతర్జాతీయ క్రీడల్లో భారత ఆటగాళ్లు పోడియంలో నిలిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్తగా తీసుకొచ్చిన క్రీడా బిల్లు కూడా తగవుల్ని పరిష్కరించడంతో పాటు క్రీడాకారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. అథ్లెట్లు రాణించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాం’ అని అన్నారు.
బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!
దేశంలోని క్రీడా సమాఖ్యలన్నీ క్రీడా బిల్లుకు లోబడే ఉండాలని నిర్ణయించామని, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా కొత్త క్రీడా పాలసీ ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. తద్వారా ప్రతీ సమాఖ్యలోనూ జవాబుదారీతనాన్ని పెంచామని అన్నారు.
అంతర్జాతీయ క్రీడల్లో పురుషులకు దీటుగా భారత మహిళా అథ్లెట్లు పోటీపడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కార్యక్రమాలు అథ్లెట్ల కోసమే రూపొందించామని మాండవీయ తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని, భారత క్రీడావికాసం కోసం ప్రణాళికబద్ధంగా కృష్టి చేస్తున్నారని ఆయన చెప్పారు. పదేళ్ల ప్రణాళికతో క్రీడాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మన్‌సుఖ్ మాండవీయ అన్నారు.
క్షేత్రస్థాయిలో
ఇక భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతిభాన్వేషణ పోటీలను పెంచుతామని చెప్పారు. కేవలం నగరాలు, అకాడమీలే కాదు... మారుమూల గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రతిభావంతులను పాఠశాల స్థాయి పోటీల్లో గుర్తించి నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు.