National Sports Bill 2025: లోక్‌సభ ఆమోదం.. ఇందులో ఏముంది?
జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు-2025 (National Sports Governance Bill)కి లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. అదే విధంగా.. జాతీయ యాంటీ-డోపింగ్ (సవరణ) బిల్లుకు కూడా ఈరోజే ఆమోదం లభించింది. అయితే, విపక్షాలు మాత్రం ఇందుకు సహకరించలేదు. అయినప్పటికీ నిరసనల నడుమే క్రీడా పరిపాలనా బిల్లుకు ఆమోదం లభించింది.అతిపెద్ద సంస్కరణ ఇదిఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ సభలో మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడా రంగంలో ప్రవేశపెట్టిన అతిపెద్ద సంస్కరణ ఇది. జవాబుదారీతనం తీసుకురావడం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుంది. క్రీడా సమాఖ్యలన్నీ అత్యుత్తమంగా పరిపాలన చేసేందుకు ఇది తోడ్పడుతుంది’’ అని పేర్కొన్నారు.స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌లో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుందన్న మాండవీయ.. దురదృష్టవశాత్తూ ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదంలో పాలు పంచుకోలేకపోయాయన్నారు. ‘‘1975లో మేము ఈ బిల్లుకు సంబంధించి తొలి డ్రాఫ్ట్ తయారుచేశాము. కానీ క్రీడలు కూడా వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజకీయ రంగు పులుముకున్న కారణంగా ఇది సాధ్యం కాలేదు.అయితే, కొంతమంది మంత్రులు ఈ బిల్లును ప్రవేశపెట్టగలిగారు కానీ.. దీనికి ఆమోదం లభించేలా చేయలేకపోయారు. 2011లో మనకు జాతీయ స్పోర్ట్స్ కోడ్ వచ్చింది. దానిని బిల్లుగా మార్చేందుకు మేము కృషి చేశాం.అనంతరం క్యాబినెట్లో చర్చల్లో భాగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఇది పార్లమెంట్ వరకు చేరుకోలేకపోయింది. ఏదేమైనా నేనషల్ స్పోర్ట్స్ బిల్ గవర్నెన్స్ బిల్ ఒక సంచలనాత్మక మార్పునకు నాంది.అతి పెద్దదైన మన దేశంలో ఒలింపిక్స్‌లో, అంతర్జాతీయ స్థాయిలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం నిజంగా విచారకరం. క్రీడా రంగ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది’’ అని మన్సుఖ్ మాండవీయ చెప్పుకొచ్చారు.ఇందులో ఏముంది?కాగా క్రీడా సంస్థలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పించడం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు ద్వారా సాధ్యమవుతుంది. రాజకీయ ఒత్తిడి, జోక్యం ఉండదని చెబుతున్నారు. స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు ద్వారా.. అథ్లెట్లు, ఆఫీస్ బేరర్లు, క్రీడా సమాఖ్యల మధ్య తగాదాలను త్వరితగతిన పరిష్కరించే వీలుంటుంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఆటగాళ్ల ఎంపిక ఉండేలా చూసుకుంటారు.జాతీయ క్రీడా సమాఖ్యలకు సంబంధించిన ఆడిట్లు సకాలంలో పూర్తి చేయడంతో పాటు.. నిధుల వినియోగానికి సంబంధించి పారదర్శకత ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. క్రీడా పరిపాలనా విభాగాన్ని మెరుగుపరచి, ఎవరి పాత్ర ఏమిటన్న అంశాలపై స్పష్టతనివ్వడం ద్వారా ఒలింపిక్స్ వంటి హై ప్రొఫైల్ ఈవెంట్లు నిర్వహించడం కాస్త సులువుగా మారుతుంది. అయితే, అన్నింటికీ మించి ఆటగాళ్లకు సురక్షిత వాతావరణం కల్పించడం.. అంటే.. అన్ని రకాల వేధింపుల నుంచి ఉపశమనం కలిగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.బీసీసీఐకి రిలీఫ్ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి మాత్రం ఈ బిల్లులో ఉపశమనం లభించింది. బోర్డు వ్యవహారాల గురించి ఆర్టీఐ నుంచి సమాచారం కోరేందుకు మాత్రం అనుమతి ఉండదు. బీసీసీఐ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదు.. కాబట్టి అందుకే ఈ మేరకు మినహాయింపు ఇచ్చారని సమాచారం. అదే విధంగా.. అడ్మినిస్ట్రేటర్లకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ బాడీ అనుమతించినట్లయితే.. 70- 75 ఏళ్ల వ్యక్తులు కూడా క్రీడా సమాఖ్యల ఎన్నికల్లో పాల్గొనవచ్చు.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు!