
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ తన పూర్తి పదవీకాలం కొనసాగనున్నారు. 2022 అక్టోబర్‌లో ఎంపికైన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారు.
గత నెల 19న బిన్నీకి 70 ఏళ్లు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం ఆయన వెంటనే తప్పుకోవాల్సి ఉంది. అయితే తాజాగా మంగళవారం ‘నేషనల్ స్పోర్ట్స్ బిల్’ పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. దీని ప్రకారం క్రీడా సంఘాల ఆఫీస్ బేరర్ల వయోపరిమితిని 75 ఏళ్లకు పెంచారు.
ఇక బీసీసీఐ కూడా ఒక క్రీడా సమాఖ్యగా ఈ బిల్లు పరిధిలోకి రావడంతో ఈ నిబంధన కూడా దానికి వర్తించనుంది. దీంతో బిన్నీ కొనసాగేందుకు మార్గం సుగమమైంది. సెప్టెంబరు చివర్లో జరిగే ఏజీఎంలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నికపై బీసీసీఐ ముందుకు వెళుతుంది. ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకోకపోయినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌లో మన జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా కొత్త బిల్లు పరిధిలోకి వచ్చింది.
అయితే బోర్డు నుంచి ఎలాంటి సమాచారం కోరకుండా దానిని ఆర్టీఐ పరిధి నుంచి తప్పిస్తూ సవరణ చేర్చిన తర్వాతే ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. పార్లమెంట్‌లో ఇప్పుడే బిల్లు పాస్ అయింది కాబట్టి దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత లోటుపాట్లపై చర్చిస్తామని బీసీసీఐ న్యాయ నిపుణుల బృందం అభిప్రాయపడింది.
చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్