
ఆమోదించిన ఉభయసభలు
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో జాతీయ క్రీడా బిల్లు పాసయ్యింది. సోమవారం లోక్‌సభ ఆమోదించిన బిల్లును 24 గంటల్లోనే మోదీ సర్కారు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును ఎగువ సభ ఆమోదించింది. అలాగే సవరించిన జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ రెండు బిల్లులను రాష్ట్రపతి నోటిఫై చేయగానే చట్టంగా మారతాయి.
రాజ్యసభలో బిహార్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సభలో మాట్లాడుతూ ‘20 దేశాల్లో క్రీడా చట్టం అమలవుతోంది. ఈ 21వ శతాబ్దిలో మన దేశంలో క్రీడా చట్టం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం’ అని అన్నారు.
అనంతరం బిల్లుపై దాదాపు 2 గంటలకు పైగానే చర్చ జరిగింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష తదితరులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం క్రీడారంగంలో పారదర్శకత పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందడం పట్ల కేంద్ర క్రీడాశాఖ మంత్రి మాండవీయ హర్షం వ్యక్తం చేశారు.
చట్టరూపం దాల్చనున్న బిల్లు స్వరూపమిది...
» ఈ బిల్లులో అత్యంత కీలకమైంది జాతీయ క్రీడల బోర్డు (ఎన్‌ఎస్‌బీ) ఏర్పాటు. జాతీయ సమాఖ్యలకు గుర్తింపు, లేదంటే రద్దులాంటి విశేషాధికారాలు బోర్డుకు ఉంటాయి. సకాలంలో ఎన్నికలు, సక్రమంగా జట్ల ఎంపికలు చేసేలా చూస్తుంది. బోర్డు గుర్తించిన సమాఖ్యలకే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.
» కొత్త బిల్లు ప్రకారం జాతీయ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ కూడా ఏర్పాటు అవుతుంది. సమాఖ్యలో కుమ్ములాటలు, జట్ల ఎంపికల్లో వివాదాలను పరిష్కరించే అధికారం ఈ ట్రైబ్యునల్‌కే కల్పించారు. ఈ ట్రైబ్యునల్ తీర్పులపై కేవలం సుప్రీం కోర్టులోనే సవాలు చేసే అవకాశముంటుంది. దిగువ కోర్టుల్లో ఇకమీదట కేసుల విచారణ ఉండదు.
» క్రీడా పాలకులు ఏళ్లతరబడి తిష్టవేసేందుకు వీలుండదు. అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు గరిష్టంగా 12 ఏళ్ల పాటు పదవుల్లో కొన సాగవచ్చు. కాగా గరిష్ట వయసును 70 నుంచి 75కు పెంచారు. అయితే సదరు సమాఖ్యకు సంబంధించిన అంతర్జాతీయ సమాఖ్య నియమావళికి లోబడే ఈ పరిమితి ఉంటుంది.