బాల్యం ఒక ఆనందాల హరివిల్లు, స్వచ్ఛతకు పొదరిల్లు.. అంతేకాకుండా అద్భుతమైన భవిష్యత్తుకు దారులు వేసే మొదటి పాఠశాల. చిరు ప్రాయంలో చిగురించిన ఆలోచనలు, ఆసక్తికర విషయాలే వారి అందమైన భవిష్యత్తుకు ప్రణాళికలను రూపొందిస్తాయి. పసి హృదయాల్లో నిలిచిపోయిన ఆలోచనలు ఆశయాలుగా పరిణామం చెంది.. వారిని అనేక రంగాల్లో రాణించేలా చేస్తాయనడానికి సాక్ష్యాలెన్నో. చిన్నతనం అంటే కేవలం చదువులే కాదు.. కళలు, క్రీడలు, సాహిత్యం ఇలా ఎన్నో అంశాలపైన ఆసక్తి పెంచుకుని ముందుకు సాగుతున్న పిల్లలెందరో. తమకు నచ్చిన అంశాల్లో రాణిస్తూనే.. ప్రముఖ వేదికలపై గుర్తింపు పొందడం.. మరి కొందరు చిన్నారులకు స్ఫూర్తిగా నిలవడం మనం చూస్తూనే ఉన్నాం. బాలల దినోత్సవం నేపథ్యంలో అలాంటి కొందరు చిన్నారులను ‘సాక్షి’ పలుకరించింది. వారిలోని జిజ్ఞాసను, అకుంటిత దీక్షను, అభ్యసనా లక్షణాలను అభినందిస్తూ.. నేటి తరానికి వారిని పరిచయం చేస్తుంది. ఆ విశేషాలు..
నాట్య మయూరి.. అభినయం చూపిన దారి..
శాస్త్రీయ నృత్యంలో తానొక నాట్య మయూరి.. అభినయంలో కూచిపూడి అందాన్ని ప్రదర్శించే అభినేత్రి ఆమే.. జూపాక తన్మయ్. తొమ్మిదో తరగతి చదువుతున్న తన్మయ్ చిన్న వయసులోనే అత్యద్భుత ప్రదర్శనలు చేస్తుంది. అయితే అందరిలా సాంస్కృతిక వేదికలపై శిక్షణతో ఇదంతా సాధ్యపడలేదంటోంది తన తల్లి జోష్న. పుట్టుకతోనే క్లెఫ్ట్ లిప్ట్ సమస్యతో పుట్టిన తన్మయ్.. అందరిలా మాట్లాడలేదు.. అనుకున్నది చెప్పలేదు. ఈ తరుణంలో ఏది చెప్పాలన్నా కనుసైగలతో, చేతులు ఊపుతూ చెబుతుంటే నాట్యం చేస్తున్నట్టే అనిపించింది.. దీంతో తనను కూచిపూడి శిక్షనలో చేరి్పంచానని జోస్న చెబుతున్నారు. అలా మొదలైన తన్మయ్ సాంస్కృతిక నృత్య ప్రయాణం తెలంగాణలో విభిన్న వేదికపై ప్రదర్శన చేసే వరకూ చేరింది.
ఇందులో భాగంగా నగరంలోని రవీంద్రభారతి మొదలు తిరుపతి, ధర్మపురి, బాసర, వేములవాడ వంటి పుణ్య క్షేత్రాలతో పాటు మైసూర్ వంటి ఇతర ప్రాంతాల్లోనూ ప్రదర్శనలు చేసింది. తన నాట్య ప్రయాణంలో ఇప్పటి వరకూ నాట్య మయూరి అవార్డుతో పాటు జాతీయ స్థాయి స్వర్ణ నంది, నాట్య ఊర్వశి అవార్డు, బాల నాట్య రత్న, శివ శూలం పురస్కారం (2021), నాట్య సరస్వతి, అన్నమయ్య కీర్తనల పాద నృత్య యాగం అవార్డు వంటివి అందుకుంది.
ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కళ ఉత్సవ–2025లో పాల్గొంది. నృత్య ప్రయాణం అందించిన ఆత్మస్థైర్యంతో ప్రస్తుతం తన జన్యు వైల్యాన్ని శస్త్ర చికిత్సతో తొలగించుకుని భవిష్యత్ వైపు అడుగులు వేస్తోంది. ఇటు చదువులను, అటు కూచిపూడి నృత్యంలోనూ రాణిస్తానని అంటోంది తన్మయ్. తన శిక్షణను బెంగళూరుకు చెందిన ప్రముఖ నృత్య శిక్షకురాలు మణిపూరి్ణమ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేదికగా నేర్చుకున్నానని చెబుతోంది.
ఆర్చరీలో అద్భుతం.. ఒలింపిక్సే లక్ష్యం..!
అందరిలా కాకుండా వినూత్నంగా తనదైన లక్ష్యంపై గురిపెట్టింది.. నగరానికి చెందిన అనణ్య నిమ్మల. మన వారసత్వ కళ, భవిష్యత్ ఫేవరెట్ స్పోర్ట్స్ ఆర్చరీలో రాణిస్తోంది. నగరంలోని స్లోకా ది హైదరాబాద్ వా్రల్డాఫ్ స్కూల్‌లో చదువుతూ.. విలువిద్యలోనూ రాణిస్తోంది.
అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. గతేడాదిలో సీబీఎస్సీ టీం సౌత్ జోన్‌లో గోల్డ్ మెడల్, సీబీఎస్సీ టీం నేషనల్స్‌లో బ్రాంజ్ మెడల్, సీబీఎస్సీ ఇండివీడ్యువల్ సౌత్ జోన్‌లో 5వ స్థానంలో నిలిచి తన విల్లు ప్రతాపాన్ని చూపింది. నగరంలోని ఫ్రెండ్స్ అండ్ ఆర్చర్స్ ట్రైనింగ్ సెంటర్‌లో కోచ్ గంగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. తన తదుపరి లక్ష్యం– 2028 ఒలింపిక్స్ అని గర్వంగా చెబుతోంది. ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరణ, క్రమశిక్షణతో మెలగడం వంటి లక్షణాలను ఆర్చరీ వల్లే నేర్చుకున్నానని చెబుతోంది.
సెయిలింగ్ క్వీన్.. రమీజా భాను
జాతీయ, అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో రాణిస్తూ.. ఇటు నగరానికి, అటు దేశానికి కీర్తి ప్రతిష్టతలు తీసుకొస్తోంది 14 ఏళ్ల సెయిలర్ ఎస్‌కే.రమీజా భాను. నగరంలోని రెయిన్‌బో హోంలో చదువుకుంటున్న రమీజా భాను ఇప్పటి వరకూ నేషనల్స్‌లో పలు పతకాలు సాధించి ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది.
గత ఏడాది నగరంలోని యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో కోచ్ సుహీం షేక్ శిక్షణలో రాటుదేలుతోన్న రమీజా ఈ ఏడాది నేషనల్స్‌లో పలు విభాగాల్లో మెడల్స్ సాధించి ఒమన్ వేదికగా జరిగిన రెండు అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. తన ప్రతిభను గుర్తించిన భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఇటీవల రమీజా భానును ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకుని సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించే దిశగా యాచ్ క్లబ్‌లో శిక్షణ పొందుతున్నానని, ఎప్పటికైనా ఒలింపిక్స్ సెయిలింగ్‌లో భారత్‌కు పతకం తేవడమే తన లక్ష్యమని రమీజా చెబుతోంది.
(చదవండి: చిల్డ్రన్స్ డే: బాలతారల ఇంటర్వ్యూలు)


