కష్టాలనూ ఆడేసుకున్నారు | Girls Winning International Levels in Many Sports | Sakshi
Sakshi News home page

కష్టాలనూ ఆడేసుకున్నారు

Aug 29 2025 12:36 AM | Updated on Aug 29 2025 12:36 AM

Girls Winning International Levels in Many Sports

‘మాది పేదకుటుంబం అయినా, నా దగ్గర విలువైన సంపద ఉంది’ అంటూ ఉండేది ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ ఓపీ జైషా. ‘ఆ సంపద ఏమిటి?’ అని అవతలి వ్యక్తి అడిగే లోపే... ‘కష్టం, పట్టుదల’ అని చెప్పేది జైషా. జైషా మాత్రమే కాదు...పేదరికంలో పుట్టి పెరిగిన ఎంతోమంది అమ్మాయిలు ‘కష్టం, పట్టుదల’ అనే విలువైన సంపదతో పేదరిక కష్టాలను అధిగమించారు. హాకీ నుంచి ఆర్చరీ వరకు ఎన్నో క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు పతాకాలు ఎగరేశారు.

ఆకలి తట్టుకోలేక మట్టితిన్న అమ్మాయి
ఓపీ జైషా అయిదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చని  పోయాడు. అసలే అంతంత మాత్రంగా ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆకలి తట్టుకోలేక జైషా మట్టి తిన్న రోజులు కూడా ఉన్నాయి.  పొద్దుటే లేచి కిలోమీటర్‌ల కొద్దీ దూరాలు నడిచిపాలు అమ్మేది. ‘రేపు భోజనం ఎలా?’ అనేది జైషా కుటుంబం ముందు ఉన్న ప్రధాన సవాలు. అయినప్పటికీ ఆటలపై తన ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. కేరళకు చెందిన జైషా ప్రఖ్యాత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌. మారథాన్‌లో నేషనల్‌ రికార్డ్‌ హోల్డర్‌. ‘అవకాశాలు, అదృష్టాలు అనేవి ఎక్కడి నుంచో రావు. మన కష్టంలో నుంచే వస్తాయి’ అంటుంది జైషా.

గురి తప్పని లక్ష్యం
రాంచీలో పుట్టి పెరిగిన దీపిక కుమారి తండ్రి ఆటోడ్రైవర్‌. చిన్నప్పుడు చెట్టు పైనున్న మామిడి కాయలను గురి తప్పకుండా కొట్టేది. గురితప్పని ఆ ఉత్సాహమే దీపికను ఆర్చరీ వైపు అడుగులు వేసేలా చేసింది. ట్రైబల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో చేరిన దీపిక కుమారికి రోజుకు మూడు పూటలా భోజనం దొరికేది. పేదరికం నేపథ్యం నుంచి వచ్చిన దీపికకు అదే లగ్జరీగా అనిపించేది.

కష్టాల్లో సైతం వెరవని ధైర్యం, అంకితభావంతో ఎన్నో విజయాలు సాధించింది దీపిక. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ (2010)లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ‘కొన్ని సంవత్సరాల క్రితం చాలామందికి ఆర్చరీ అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు పిల్లలు కూడా ఆర్చరీ గురించి మాట్లాడుతున్నారు. నాకు ఆర్చరీపై ఆసక్తి కలగడానికి మీరే స్ఫూర్తి అని పిల్లలు చెబుతున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది’ అంటుంది దీపిక కుమారి.

పరుగు ఆపొద్దు
‘ఐ బికమ్‌ ఏ రన్నర్‌’ పేరుతో పుస్తకం రాసింది సొహినీ ఛటో పాధ్యాయ. అంతర్జాతీయ స్థాయిలో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది మంది ప్రసిద్ధ ఉమెన్‌ రన్నర్‌ల స్ఫూర్తిదాయక జీవిత కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 1952 ఒలింపిక్స్‌లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన మేరీ డిసౌజా, బ్యాంకాక్‌ అసియన్‌ గేమ్స్‌(1970)లో బంగారు పతకం గెలుచుకున్న కమల్‌జిత్‌ సందు, పీటి ఉషా, శాంతి సౌందర్యరాజన్, పింకీ ప్రమానిక్, దూతీ చంద్‌లాంటి క్రీడకారుల జీవితవిశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఈ విజేతలకు క్రీడా ప్రయాణం అనేది నల్లేరు మీద నడక కాలేదు. ‘ఆర్థిక కష్టాలు’ కొందరికీ, ‘అమ్మాయిలకు ఆటలెందుకు!’ అనే ఈసడింపులు మరికొందరికీ... ఇలా రకరకాల సవాళ్లు ఎదురయ్యాయి. అయినా వారు పరుగు ఆపలేదు. ఆటలకు పేదరికాన్ని దూరం చేసే శక్తి ఉందనే విషయాన్ని కూడా ఈ పుస్తకం ద్వారా చాటిచెప్పింది సోహిని. ‘పేదరికం నుంచి బయటపడడానికి ఆటలు నాకు ఉపకరించాయి’ అంటుంది ఒలింపియన్‌ లలిత బాబర్‌.

మైదాన ఆటలే మేలు
పిల్లల ప్రపంచానికి ఆన్‌లైన్‌ ఆటలు దగ్గరయ్యాయి. మైదాన ఆటలు దూరం అయ్యాయి. ఆన్‌లైన్‌ ఆటలతో పోల్చితే మైదానాల్లో ఆడే ఆటల వల్ల పిల్లలకు అనేక రకాలుగా మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. మైదాన క్రీడలు పిల్లలకు వ్యాయామంలా పనిచేస్తాయి. మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. నలుగురిలో త్వరగా కలిసి  పోయే స్వభావాన్ని పెంచుతాయి. కుంగుబాటును దూరం పెట్టి చురుగ్గా ఉండేలా చేస్తాయి. శరీరంపై నియంత్రణ ఉండేలా చేస్తాయి.

ఆకలి రోజుల నుంచి టోక్యో వరకు
రోజుకు రెండు పూటలా కడుపు నిండా తింటే, ఆ కుటుంబానికి ఆరోజు ఘనమైన రోజులా ఉండేది. అలాంటి కడు పేద కుటుంబంలో పుట్టిన భావనా జాట్‌ ఆర్థిక కష్టాలను అధిగమించి ‘రేస్‌ వాకర్‌’గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. టోక్యో 2020 ఒలింపిక్స్‌ కోసం అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా రేస్‌ వాకర్‌గా చరిత్ర సృష్టించింది. రాజస్థాన్‌లోని కబ్రా అనే చిన్న గ్రామానికి చెందిన భావనా జాట్‌ పేదరికపు సమస్యలకు ఎప్పుడూ భయపడలేదు. కలలకు తెరవేయలేదు.

విరిగి  పోయిన హాకీ స్టిక్‌తో...
ఆసియన్‌ గేమ్స్‌ (2018) మహిళల హాకీ జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వహించిన రాణి రాం పాల్‌ పేదింటి బిడ్డ. హరియాణకు చెందిన రాణి ఇల్లు ఎండొచ్చినా, వానొచ్చినా సమస్యే అన్నట్లుగా ఉండేది. విద్యుత్‌ సదు పాయం ఉండేది కాదు. దోమలు వీరవిహారం చేసేవి. రాణికి హాకీపై ఆసక్తి చిన్నప్పటి నుంచే మొదలైంది. తన ఇంటికి సమీపంలోని హాకీ అకాడమీలో ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటే గంటల తరబడి చూస్తుండేది. ఎక్కడో దొరికిన విరిగి  పోయిన హాకీ స్టిక్‌తో వారిని అనుకరిస్తూ ఉండేది.
‘నాకు హాకీలో శిక్షణ ఇవ్వండి’ అని హాకీ అకాడమీ వారిని అడిగితే తిరస్కరించారు. ‘ఆ సమయంలోనే నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను’ అంటున్న రాణి తన కలను నిజం చేసుకుంది. హాకీలో అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది.

వెక్కిరింపులు ఎదురైనా...
మణిపుర్‌లోని పేద కుటుంబంలో పుట్టిన బింద్యారాణిదేవికి చిన్నప్పటి నుంచి ఆటలు అంటే ఇష్టం. ఎత్తు తక్కువగా ఉండడం వల్ల వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంపిక చేసుకుంది. అంతకుముందు తైక్వాండో సాధన చేసేది. ‘ఎందుకు తల్లీ ఈ కష్టాలు, బరువులు ఎత్తడాలు....’ అనేవాళ్లు చుట్టుపక్కల వాళ్లు. ఎవరి మాట ఎలా ఉన్నా తనకు మాత్రం పెద్ద కలలు ఉండేవి.

‘మహా అంటే జిల్లా స్థాయి వరకు వెళ్లగలవు’ అనే వెక్కిరింపుల మాట ఎలా ఉన్నా జిల్లా స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది రాణిదేవి. థాయ్‌లాండ్‌లో జరిగిన ఐడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ కప్‌(2024)లో కాంస్య పతకం గెలుచుకుంది. ఐడబ్ల్యూఎఫ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ వరల్డ్‌ కప్‌లో మహిళల 55 కేజీ ఈవెంట్‌లో పతకం గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది. ‘ప్రతికూల మాటలు ఎన్ని వినబడినా లక్ష్యసాధనలో దృఢంగా ఉండాలి’ అంటుంది బింద్యారాణి దేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement