
న్యూఢిల్లీ: త్వరలోనే భారత ప్రభుత్వం కొత్త క్రీడా బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇది వరకే జాతీయ క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్) ఉంది. దీనికి కొన్ని సవరణలు, మార్పు–చేర్పులతో తాజాగా స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఇన్నేళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్వతంత్ర క్రీడా సమాఖ్యగా చక్రం తిప్పింది. ఇప్పుడు కొత్త బిల్లు ప్రకారం క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ గవర్నెన్స్ గొడుగు కిందకే రానుంది.
ఇదే విషయమై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. ‘దేశంలో ఉన్న అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)ల మాదిరే బీసీసీఐ కూడా కొత్త గవర్నెన్స్ బిల్లు పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు, గ్రాంట్లు పొందిన, పొందకపోయినా పార్లమెంటులో చట్టం అయ్యాక క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ కోడ్ కిందకే వస్తుంది’ అని క్రీడాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
క్రీడా సమఖ్యల లాగే క్రికెట్ బోర్డుకు ఉన్న స్వయంప్రతిపత్తికి ఎలాంటి విఘాతం కలుగదని, అయితే వివాదాలు, ఇతరాత్ర సమస్యలు ఎదురైతే మాత్రం జాతీయ క్రీడా నియమావళి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్–2028లో క్రికెట్ క్రీడాంశం ఉండటంతోనే బోర్డు ఒలింపిక్ సంఘం పరిధిలోకి వచ్చినట్లయ్యింది.
జాతీయ క్రీడాసమాఖ్యల్లో నిర్లిప్తతను దూరం చేసి జవాబుదారితనాన్ని మరింత పెంచేందుకు, సకాలంలో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు, పారదర్శక పరిపాలన, అర్హులైన క్రీడాకారుల సంక్షేమం, ప్రమాణాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును తీసుకొస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఒలింపిక్ చార్టర్ ప్రకారం నడుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ బిల్లు తెలియజేస్తుంది.
దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన మోదీ సర్కారు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు సిద్ధమైంది. ఇది వరకటి స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 70 ఏళ్ల వయసుకు చేరిన ఏ కార్యవర్గ సభ్యుడైనా పదవికి రాజీనామా చేయాల్సివుండగా... ఈ గరిష్ట వయోపరిమితి ఇక మీదట 75కు చేరే అవకాశముంది.
బిల్లు పాసయితే...
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అపెక్స్ కమిటీ రూపుదిద్దుకుంటుంది. ఈ కమిటీలో కేబినెట్ కార్యదర్శి హోదా ఉన్న అధికారి లేదంటే క్రీడా శాఖ కార్యదర్శి, స్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ చైర్ పర్సన్ అవుతారు. క్రీడలకు సేవలిందించిన దిగ్గజ క్రీడాకారులు, కోచ్‌లు సభ్యులుగా ఉంటారు. వీరు తప్పనిసరిగా ద్రోణాచార్య, ఖేల్‌రత్న, అర్జున అవార్డీలై ఉండాలి.
జాతీయ క్రీడా సమాఖ్యలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులకు ఈ కమిటీలో చోటుంటుంది. ముఖ్యంగా తరచూ వివాదాస్పదమవుతున్న అంశాలపై మరింత జవాబుదారీతనంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది. ఎంపికల ప్రక్రియ, ఆటగాళ్ల నిషేధం ఇతరాత్ర సమస్యల్ని ఈ కమిటీ పారదర్శక విధానంతో పరిష్కరిస్తుంది.