
టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu)కు కోపం వచ్చింది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా ఈ మాజీ ఓపెనర్ మండిపడ్డాడు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయొద్దంటూ సదరు నెటిజన్‌కు చురకలు అంటించాడు.
అసలేం జరిగిందంటే.. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆసీస్‌తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టుపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం.. మొహమ్మద్ షమీని కాదని హర్షిత్ రాణా (Harshit Rana)కు జట్టులో చోటివ్వడం ఇందుకు ప్రధాన కారణాలు.
ఏడు వికెట్ల తేడాతో ఓటమి
ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి నేపథ్యంలో మరోసారి మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్‌లో గిల్ సేన ఆసీస్ చేతిలో.. ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం విజేతను తేల్చారు.
అగార్కర్, గంభీర్‌లను తొలగిస్తేనే సరి?
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధు.. గంభీర్, అగార్కర్‌లను ఘాటుగా విమర్శించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. జాడ్ ఇన్సానే అనే అకౌంట్ నుంచి ‘‘ఒకవేళ టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలవాలనుకుంటే.. బీసీసీఐ అజిత్ అగార్కర్, గౌతం గంభీర్‌లను వీలైనంత త్వరగా తమ పదవుల నుంచి తప్పించాలి.
అదే విధంగా పూర్తి గౌరవ మర్యాదలతో కెప్టెన్సీని రోహిత్ శర్మకు తిరిగి అప్పగించాలి’’ అని సిద్ధు అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందుకు సిద్ధుతో పాటు గౌతీ, అగార్కర్‌ల ఫొటోలను కూడా సదరు నెటిజన్ జతచేశారు.
సిగ్గు పడండి
ఈ విషయంపై స్పందించిన సిద్ధు.. ‘‘నేను ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అసత్యపు వార్తలను ప్రచారం చేయకండి. అసలు ఇలాంటివి కూడా చేస్తారని అస్సలు ఊహించలేదు. సిగ్గు పడండి’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఈ టూర్ కొనసాగుతుంది.
చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్