
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం (IND vs AUS 1st ODI) పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు గుప్పించాడు.
పెర్త్ వన్డేలో భారత తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని నీరుగార్చారని అశూ మండిపడ్డాడు. వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసీస్‌తో సిరీస్‌తో తన ప్రయాణం మొదలుపెట్టాడు. పెర్త్ స్టేడియంలో టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
రో- కో ఫెయిల్
ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ 8, గిల్ 10 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) కూడా విఫలం కాగా.. అక్షర్ పటేల్ 31, కేఎల్ రాహుల్ 38 పరుగులతో రాణించి జట్టు పరువు కాపాడారు. ఆల్‌రౌండర్లలో వాషింగ్టన్ సుందర్(10), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
రాణించిన మిచెల్ మార్ష్
వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులే చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 21.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసి.. డీఎల్‌ఎస్ పద్ధతితో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37), మ్యాట్ రెన్షా (21 నాటౌట్) రాణించారు.
Just when #TeamIndia needed it most! @Sundarwashi5 breaks a crucial partnership. 👏#AUSvIND 👉 1st ODI | LIVE NOW 👉 https://t.co/FkZ5L4CrRl pic.twitter.com/6e1VZmbAjz
— Star Sports (@StarSportsIndia) October 19, 2025
తేలిపోయిన భారత బౌలర్లు
వికెట్ తీయడానికి తిప్పలు పడ్డ భారత బౌలర్లలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం గురించి అశ్విన్ మాట్లాడుతూ.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు.
నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు
‘‘వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నేను అర్థం చేసుకోగలను. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్‌లో డెప్త్ కోసమే. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి నితీశ్‌ను వారికి జతచేశారు.
కానీ ఇదేం పద్ధతి?
అసలు మీరెందుకు బౌలింగ్‌పై దృష్టి పెట్టడం లేదు బాస్. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్ యాదవ్ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలడు? ఈ పిచ్‌పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్ కూడా రాబట్టగలడు.
అత్యుత్తమ బౌలర్లను పక్కన పెడతారా?
ఏమైనా అంటే.. బ్యాటింగ్ డెప్త్ అని మాట్లాడతారు. బ్యాటింగ్ ఆర్డర్ రాణించాలంటే... బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా! పరుగులు రాబట్టడం బ్యాటర్ల పని. అదనపు బ్యాటర్ కోసం ఆల్‌రౌండర్లను దించి వారి పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? జట్టులో అత్యుత్తమ బౌలర్లను పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం?
కేవలం బ్యాటింగ్ ఆర్డర్‌ను పొడిగించుకోవడానికి తుదిజట్టు కూర్పు విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి’’ అని అశ్విన్.. టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్- భారత్ మధ్య గురువారం రెండో వన్డేకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అడిలైడ్ వేదిక.
చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే?