
మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అనుహ్యంగా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన హర్మన్ సేన.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు సెమీస్‌కు ఆర్హత సాధించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌లో అడుగు పెట్టగా.. మూడో జట్టుగా ఇంగ్లండ్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. మిగిలిన ఒక్క స్ధానం కోసం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ నెలకొంది.
భారత్ సెమీస్ చేరాలంటే?
ఇక ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం 4లో కొనసాగుతున్నప్పటికి.. సెమీస్ చేరాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.
మన అమ్మాయిల జట్టు ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్ వద్ద కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే కివీస్(-0.245) కంటే భారత్(+0.526) రన్ రేటు మెరుగ్గా ఉండడంతో మూడో స్ధానంలో నిలిచింది. కాగా వరుసగా కివీస్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.
శ్రీలంక, పాకిస్తాన్‌లపై న్యూజిలాండ్ గెలవడం అంత కష్టమేమి కాదు. ఒకవేళ అదే జరిగింటే భారత్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యి ఉండేవి. భారత్‌కు, న్యూజిలాండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 23న ముంబై వేదికగా కివీస్‌తో హర్మన్ సారథ్యంలోని భారత్ తలపడనుంది.
ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా సెమీస్ భవితవ్యం దాదాపు తేలిపోతుంది. కివీస్‌పై భారత్ విజయం సాధిస్తే 6 పాయింట్లతో మెరుగైన స్థితికి చేరుకుంటుంది. అప్పుడు టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాపై భారత్‌కే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువ. కాబట్టి ఎటువంటి సమీకరణాలు లేకుండా మన జట్టు సెమీస్ చేరుతుంది.
ఇక న్యూజిలాండ్ జట్టుకు కూడా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ కివీస్ చేతిలో భారత్ ఓటమి పాలైనప్పటికి నకౌట్‌కు అర్హత సాధించే అవకాశముంది. ఎలా అంటే న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ప్రస్తత పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించడం అంత సులువు కాదు.
అదే సమయంలో భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించాలి. అప్పుడు ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి.. బంగ్లాపై మనం ఘన విజయం సాధిస్తే పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ కివీస్ రెండు మ్యాచ్‌లు గెలిచిందంటే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించిక తప్పదు.
చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్