
వన్డే క్రికెట్‌లో టీమిండియా (Team India) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత జట్టు.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఓటమిపాలైంది. వన్డేల్లో దాదాపుగా రెండేళ్ల తర్వాత భారత్‌కు ఇది తొలి పరాజయం. భారత్ చివరిగా 2023 డిసెంబర్ 19న సౌతాఫ్రికా చేతిలో ఓడింది.
లేట్‌గా పలకరించిన పరాజయం
ఈ ఏడాది వన్డేల్లో భారత్‌ను పరాజయం చాలా లేట్‌గా పలకరించింది. 1991 తర్వాత ఓ ఏడాది అత్యంత లేట్‌గా పలకరించిన పరాజయం ఇది. నాడు భారత్‌కు తొలి వన్డే పరాజయం అక్టోబర్ 23న ఎదురైంది.
టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసిన గిల్
వన్డేల్టో టీమిండియా జైత్రయాత్రకు శుభ్‌మన్ గిల్ బ్రేక్‌లు వేశాడు. భారత వన్డే జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించాడు.
కోహ్లి సరసన గిల్
ఈ ఓటమితో గిల్ మరో అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు. విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్‌లో కొత్తగా నిర్మించిన ఓపస్ స్టేడియంలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 136 పరుగులకే పరిమితమైంది.
అనంతరం ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (10) కూడా తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు.
ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: Test Twenty: క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం