
క్రికెట్‌కు సరికొత్త ఫార్మాట్ పరిచయం కాబోతుంది. టెస్ట్, టీ20ల కలబోతతో ఈ ఫార్మాట్‌కు టెస్ట్ ట్వంటీగా (Test Twenty) నామకరణం చేశారు. ఈ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ వ్యూహాత్మకతను, టీ20ల వేగాన్ని కలిపిన హైబ్రిడ్ ఫార్మాట్‌గా ఉండబోతుంది.
దీని తొలి ఎడిషన్‌ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ ఫార్మాట్‌కు దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, సర్ క్లైవ్ లాయిడ్ మద్దతిచ్చారు. యువ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ఈ ఫార్మాట్‌ను కనిపెట్టినట్లు నిర్వహకులు తెలిపారు. క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడమే ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
టెస్ట్ ట్వంటీ నియమాలు..
ఈ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఒకే రోజులో పూర్తవుతాయి.
మ్యాచ్ మొత్తం 80 ఓవర్ల పాటు జరుగుతుంది.
టెస్ట్‌ల తరహాలో రెండు ఇన్నింగ్స్‌లు ఉంటాయి.
ఒక్కో ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టు 20 ఓవర్లు ఆడుతుంది.
టెస్ట్‌ల తరహాలో స్కోర్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది.
రెండు ఇన్నింగ్స్‌ల స్కోర్లు కలిపి ఫలితం నిర్ణయించబడుతుంది.
ఫలితాలు విజయం, ఓటమి, టై, డ్రాగా ఉంటాయి.
డ్రా అయితే చివరి బంతి వరకు 5 వికెట్లు మిగిలి ఉండాలి.
డ్రా అయితే సూపర్ ఓవర్ కూడా ఉంటుంది.
ప్రతి మ్యాచ్‌కు ఒక్క పవర్ ప్లే ఉంటుంది.
ఇందులో 4 ఓవర్లు మాత్రమే ఉంటాయి.
పవర్ ప్లేను కెప్టెన్ ఎంచుకుంటాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో తీసుకుంటాడా లేదా రెండో ఇన్నింగ్స్‌లో తీసకుంటాడా అన్నది అతని ఛాయిస్.
పవర్ ప్లేలో ఫీల్డింగ్ పరిమితులు ఉంటాయి.
30-యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు.
ఈ ఫార్మాట్‌లో ఫాలో ఆన్ నిబంధన కూడా ఉంటుంది.
కనీసం 75 పరుగుల వెనకబడితేనే ఫాలో ఆన్ అమల్లోకి వస్తుంది.
ఈ ఫార్మాట్‌లో అర్లీ కొలాప్స్ క్లాజ్ (early collapse clause) అనే సరికొత్త నిబంధన ఉండనుంది.
ఈ నబంధన ప్రకారం ప్రత్యర్థిని 10 ఓవర్లలోపు ఆలౌట్ చేస్తే, వారికి అదనంగా 3 ఓవర్లు పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఫార్మాట్‌లో మ్యాచ్‌లో ఐదుగురు మాత్రమే బౌలింగ్ చేయాలి.
ఒక్కో బౌలర్ గరిష్టంగా 8 ఓవర్లు వేయవచ్చు.
ఆరు ఫ్రాంచైజీలు..
ఈ ఫార్మాట్ తొలి ఎడిషన్‌కు ఆరు ఫ్రాంచైజీలు ఖరారైనట్లు తెలుస్తుంది. దుబాయ్, లండన్, అమెరికా దేశాల నుంచి తలో ఫ్రాంచైజీ.. భారత్ నుంచి మూడు ఫ్రాంచైజీలు ఉండనున్నట్లు సమాచారం. ఒక్కో ఫ్రాంచైజీలో 16 మంది ఆటగాళ్లు ఉంటారు.
ఇందులో ఎనిమిది మంది భారతీయులు, ఎనిమిది మంది అంతర్జాతీయ ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే ఆటగాళ్లు అక్టోబర్ 16 నుంచి వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు.