
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగుతున్న తొలి వన్డేలో (India Vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) డకౌటయ్యాడు. 8 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లికి ఇది తొలి డకౌట్.
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 29 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఐదు సెంచరీలు, 51కు పైగా సగటుతో పరుగులు చేశాడు. కానీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. చాలా విరామం తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి డకౌట్ కావడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఓవరాల్‌గా కోహ్లికి వన్డేల్లో ఇది 17వ డకౌట్. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లైన రికార్డు సచిన్ టెండూల్కర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా ఈ రికార్డు సనత్ జయసూర్య (34) ఖాతాలో ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఆఖరి ఓవర్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు.
శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.
కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, అనంతరం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: IND vs AUS: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోని సరసన