
అఫ్గనిస్తాన్ క్రికెటర్ల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB)కు సంఘీభావం ప్రకటించింది. తమ క్రికెటర్ల మరణానికి కారణమైన దేశంతో.. అఫ్గన్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోవడాన్ని బీసీసీఐ స్వాగతించింది.
పిరికిపందల దాడి..
ఈ మేరకు.. ‘‘సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌లో పిరికిపందలు జరిపిన సీమాంతర వైమానిక దాడుల్లో అఫ్గనిస్తాన్ యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వీరి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.
ఈ కష్ట సమయంలో బీసీసీఐ అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా నిలుస్తుంది. అఫ్గన్ క్రికెట్ ప్రపంచానికి, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మీ దుఃఖాన్ని మేమూ పంచుకుంటాం. ఇందుకు కారణమైన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.
తీవ్రంగా కలచివేస్తోంది
వైమానిక దాడుల్లో మరణించిన అమాయక ప్రజలు.. ముఖ్యంగా క్రీడల్ని భవిష్యత్తుగా ఎంచుకున్న వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అఫ్గనిస్తాన్ ప్రజలకు బీసీసీఐ హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తోంది. వారి బాధను మేమూ పంచుకుంటాము’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేరిట బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.
కాగా పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ వైఖరికి నిరసనగా పాకిస్తాన్‌తో ఆడాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు అఫ్గన్ బోర్డు ప్రకటించింది.
ఆట కంటే దేశమే ముఖ్యం
అఫ్గన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు పలువురు క్రికెటర్లు బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఆట కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. కాగా రావల్పిండి వేదికగా నవంబరు 19 నుంచి పాకిస్తాన్- శ్రీలంక- అఫ్గనిస్తాన్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది.
అయితే, పాక్ దుశ్చర్య కారణంగా అఫ్గన్ బోర్డు ఈ సిరీస్‌ను బహిష్కరించగా.. తాము మరో జట్టు కోసం వెతుకుతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘‘అప్గనిస్తాన్ తప్పుకొన్నా ట్రై సిరీస్ కచ్చితంగా జరుగుతుంది. అఫ్గన్ జట్టు స్థానాన్ని భర్తీ చేయగల టీమ్ కోసం చూస్తున్నాం’’ అని పీసీబీ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.
చదవండి: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం!