
అఫ్గనిస్తాన్ టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో తెగదెంపులు చేసుకున్నట్లు అతడు సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ వైమానిక దాడిలో అఫ్గన్ పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రషీద్ ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అఫ్గనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్తాన్ శుక్రవారం వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృత్యువాత పడగా.. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు ఉన్నారు. వీరిని కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌గా గుర్తించారు.
మానవ హక్కుల ఉల్లంఘన
పక్తికా రాజధాని షరానాలో ఫ్రెండ్లీ మ్యాచ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ స్పందిస్తూ.. పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండించాడు. ‘‘అఫ్గనిస్తాన్‌లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం.
దేశమే ముఖ్యం
ఇదొక చట్టవ్యతిరేక చర్య. మానవ హక్కుల ఉల్లంఘన. ఇందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. పాకిస్తాన్‌తో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలుగుతూ అఫ్గన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని రషీద్ ఖాన్ ఈ సందర్భంగా సమర్థించాడు. బోర్డు నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతునిస్తున్నానని.. అన్నిటికంటే దేశ సమగ్రతే ముఖ్యమని పేర్కొన్నాడు.
డిలీట్ కొట్టేశాడు
తాజాగా రషీద్ ఖాన్ మరో నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా బయోలో అతడు చేసిన మార్పు ద్వారా స్పష్టమవుతోంది. 27 ఏళ్ల ఈ వరల్డ్‌క్లాస్ స్పిన్నర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2021లో ఈ జట్టుతో చేరిన రషీద్.. మూడు టైటిళ్లు గెలిచాడు. గతేడాది కూడా ఇదే జట్టు ట్రోఫీ గెలుచుకుంది.
అయితే, తన ఎక్స్ ఖాతా బయో నుంచి ఈ జట్టు పేరును రషీద్ తొలగించాడు. అఫ్గన్ బోర్డుతో పాటు గుజరాత్ టైటాన్స్, బిగ్‌బాష్ లీగ్ స్ట్రైకర్స్, ఇన్సిగ్నియా స్పోర్ట్స్ అనే అకౌంట్లను బయోలో కొనసాగించిన రషీద్.. లాహోర్ ఖలందర్ పేరును మాత్రం డిలీట్ చేశాడు.
తద్వారా పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను బాయ్‌కాట్ చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్ వక్రబుద్ధి తగిన విధంగా.. ఇలాగే బుద్ది చెప్పాలంటూ రషీద్ చర్యను అభినందిస్తున్నారు.
చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్