
టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తనదైన ముద్ర వేశాడు. రెండున్నరేళ్ల పాటు అతడి మార్గదర్శనంలో ముందుకు సాగిన భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచింది. అంతకుముందు.. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరి.. రన్నరప్‌గా నిలిచింది.
ఇక ద్రవిడ్ జట్టులో నింపిన స్ఫూర్తి కారణంగానే తాము టీ20 ప్రపంచకప్‌తో పాటు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచామని టీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవలే వెల్లడించాడు.
ద్రవిడ్ భాయ్ తమలో గెలవాలన్న పట్టుదలను మరింత పెంచి జట్టు బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా రోహిత్- ద్రవిడ్ కాంబోలో టీమిండియా మంచి ఫలితాలు రాబట్టిందని చెప్పవచ్చు.
ద్రవిడ్‌తో మాకు విభేదాలు
భారత క్రికెట్‌లో ద్రవిడ్‌కు సౌమ్యుడనే పేరుంది. ఈ మాజీ కెప్టెన్ కెరీర్‌లో వివాదాలకు తావులేదు. అయితే, అలాంటి ద్రవిడ్ కోచ్‌గా మారిన తర్వాత మాత్రం జట్టు విషయంలో తగ్గేదేలే అన్నట్లు సెలక్టర్లతో వాదనలకు దిగేవాడట. తన ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా జట్టు కూర్పు ఉండాల్సిందేనని పట్టుబట్టేవాడట.
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘రాహుల్ ద్రవిడ్ నాకు ప్రియమైన స్నేహితుడు. అయితే, అతడు కోచ్‌గా ఉన్న సమయంలో మా మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవం. అవి తగువులాటలు అని నేను చెప్పను.
మా నిర్ణయమే ఫైనల్
కానీ ఇద్దరి మధ్య కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చేవి. కొన్ని విషయాల్లో తను అనుకున్నట్లే జరగాలని ద్రవిడ్ పట్టుబట్టేవాడు. ఏదేమైనా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే మా ఆలోచనలు ఉండేవి.
జట్టు ఎంపిక పూర్తిగా మా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు రాహుల్.. ఇప్పుడు గంభీర్.. గతంలో రోహిత్.. ఇప్పుడు శుబ్‌మన్.. ఇలా కోచ్‌లు, కెప్టెన్లుగా ఎవరున్నా సరే.. వారికి కూడా జట్టు ఎంపిక విషయంలో జోక్యం కల్పిస్తాం. వారితో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తాం.
మా పని అదే
కోచ్, కెప్టెన్ పని సులువు చేసే విధంగా అత్యుత్తమైన పదిహేను మంది ఆటగాళ్లను ఎంపిక చేయడమే మా పని. ఒకవేళ కోచ్, కెప్టెన్‌ను గనుక సెలక్షన్ విషయంలో భాగం చేయకపోతే.. అంతకంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.
కాగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
అయితే, ఈ సిరీస్‌కు ముందే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించిన యాజమాన్యం.. గిల్‌కు వన్డే పగ్గాలూ అప్పగించింది. ఇక ఇప్పటికే అతడు టెస్టు సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించిన నేపథ్యంలో గంభీర్‌తో పాటు అగార్కర్‌పైనా విమర్శలు వెల్లువెత్తాయి.
చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు