
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి దాదాపు 7 నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా జఆస్ట్రేలియాతో జరుగునున్న తొలి వన్డేలో సత్తాచాటేందుకు కింగ్ కోహ్లి సిద్దమయ్యాడు. మూడు రోజుల కిందట జట్టుతో పాటు ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన విరాట్.. ఈ సిరీస్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ క్రమంలో తొలి వన్డేకు ముందు కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లి..
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(100) అగ్రస్ధానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సచిన్ తన సుదీర్ఘ కెరీర్‌లో 51 టెస్టు, 49 వన్డేలు సెంచరీలు సాధించాడు. సచిన్ తర్వాతి స్ధానంలో 82 సెంచరీలతో విరాట్ కోహ్లి రెండో స్దానంలో ఉన్నాడు.
ఈ మాజీ కెప్టెన్ వన్డేల్లో 51 శతకాలు సాధించగా.. టెస్టుల్లో 30 సెంచరీలు, టీ20ల్లో ఒకటి బాదాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి, సచిన్ పేరిట సంయుక్తంగా ఉంది. కోహ్లి వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. సచిన్ టెస్టుల్లో 51 శతకాలు చేశాడు.
ఈ క్రమంలో పెర్త్ వన్డేలో కోహ్లి శతక్కొడితే.. ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌ను అధిగమిస్తాడు. తొలి వన్డేలో సచిన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన రెండు వన్డేల్లోనైనా కోహ్లి ఈ ఫీట్‌ను అందుకునే ఛాన్స్ ఉంది. కోహ్లికి ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు అక్కడ 29 వన్డేలు ఆడిన విరాట్ 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!