రషీద్‌ ఖాన్‌ను ఓదార్చిన పాక్‌ క్రికెటర్లు.. వీడియో | Rashid Khan Elder Brother Dies Pakistan Cricket Team Pays Tribute | Sakshi
Sakshi News home page

రషీద్‌ ఖాన్‌ను ఓదార్చిన పాక్‌ క్రికెటర్లు.. వీడియో

Aug 30 2025 6:00 PM | Updated on Aug 30 2025 6:25 PM

Rashid Khan Elder Brother Dies Pakistan Cricket Team Pays Tribute

అఫ్గనిస్తాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan)ను పాకిస్తాన్‌ క్రికెటర్లు ఓదార్చారు. ఇరుజట్ల మధ్య టీ20 మ్యాచ్‌ ముగిసిన తర్వాత పాక్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది రషీద్‌ను ఆలింగనం చేసుకుని అతడి భుజం తట్టాడు. కాగా రషీద్‌ ఖాన్‌ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

నా ప్రగాఢ సానుభూతి
ఈ స్టార్‌ స్పిన్నర్‌ అన్న అబ్దుల్‌ హలీమ్‌ శిన్వారి మృతి చెందాడు. ఈ విషయాన్ని అఫ్గన్‌ క్రికెటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (Ibrabim Zadran) సోమవారం వెల్లడించాడు. ‘‘రషీద్‌ ఖాన్‌ పెద్దన్న హాజీ అబ్దుల్‌ హలీమ్‌ మరణించారని తెలిసి నా మనసు బాధతో నిండిపోయింది. 

ట్రై సిరీస్‌
పెద్దన్న కుటుంబం మొత్తానికి తండ్రిలాంటి వాడు. రషీద్‌ ఖాన్‌, అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని ఇబ్రహీం జద్రాన్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌ సన్నాహకాల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌- పాకిస్తాన్‌- యూఏఈ మధ్య ట్రై సిరీస్‌ శుక్రవారం మొదలైంది. ఈ ముక్కోణపు పోరులో భాగంగా తొలుత పాకిస్తాన్‌- అఫ్గనిస్తాన్‌ మధ్య షార్జా వేదికగా మ్యాచ్‌ జరిగింది.

సల్మాన్‌ ఆఘా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. టాపార్డర్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (21), సయీమ్‌ ఆయుబ్‌ (14).. ఫఖర్‌ జమాన్‌ (20) విఫలం అయ్యారు. అయితే, సల్మాన్‌ ఆఘా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (36 బంతుల్లో 53)తో అలరించడంతో పాక్‌ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

అఫ్గన్‌ బౌలర్లలో ఫరీద్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీయగా..  ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, మహ్మద్‌ నబీ, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్‌ శుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది.

39 పరుగుల తేడాతో విజయం
ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ (38) ఫర్వాలేదనిపించగా.. ఇబ్రహీం జద్రాన్‌ (9) నిరాశపరిచాడు. సెదీకుల్లా అటల్‌ 23, డార్విష్‌ రసూలీ 21 పరుగులు చేయగా.. రషీద్‌ ఖాన్‌ 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు.

అయితే, మిగతావారి నుంచి సహకారం లేకపోవడంతో రషీద్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది. 19.5 ఓవర్లలో 143 పరుగులు చేసి అఫ్గనిస్తాన్‌ ఆలౌట్‌ అయింది. ఫలితంగా పాక్‌ అఫ్గన్‌పై 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం పాక్‌ క్రికెటర్లు రషీద్‌ ఖాన్‌ అన్న మృతికి సంతాపం వ్యక్తం చేశారు. డ్రెసింగ్‌రూమ్‌ సమీపంలో ప్రార్థన చేసి అతడిని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: ఆసియా కప్‌-2025: కీలక అప్‌డేట్‌.. ఆ ఒక్కటి మినహా.. ఫైనల్‌తో సహా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement