
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 16) ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ (Australia vs Bangladesh) జరుగుతుంది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆసీస్ బౌలర్ల అనుభవం ముందు బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రం కాస్త ప్రతిఘటించారు. మిగతా 9 మందిలో షర్మిన్ అక్తర్ (19), కెప్టెన్ నిగార్ సుల్తానా (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫర్జానా హాక్ (8), షోర్నా అక్తర్ (7), రితూ మోనీ (2), ఫహీమా ఖాతూన్ (4), రబేయా ఖాన్ (6), నిషిత అక్తర్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ ఒకటి, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.
చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్