
బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిట్టన్ దాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా అవతరించాడు. నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ద సెంచరీ (46 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసిన దాస్ ఈ ఘనత సాధించాడు.
దాస్‌కు ముందు ఈ రికార్డు షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. షకీబ్ బంగ్లాదేశ్ తరఫున 129 మ్యాచ్‌ల్లో 13 హాఫ్ సెంచరీలు చేయగా.. దాస్ కేవలం 110 మ్యాచ్‌ల్లోనే షకీబ్ పేరిట ఉండిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
దాస్, షకీబ్ తర్వాత టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక అర్ద సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా తమీమ్ ఇక్బాల్ (8), మహ్మదుల్లా (8), తంజిద్ హసన్ (6) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ సిరీస్ గెలుపుతో బంగ్లాదేశ్ హ్యాట్రిక్ సాధించింది.
నెదర్లాండ్స్‌ను ఖంగుతినిపించకముందు బంగ్లాదేశ్ శ్రీలంక, పాకిస్తాన్‌ను కూడా మట్టికరిపించింది. హ్యాట్రిక్ సిరీస్ విజయాలతో బంగ్లాదేశ్ ఆసియా కప్‌లో అడుగుపెట్టబోతుంది.
చివరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ దశలో ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆట ఆగిపోయే సమయానికి జాకిర్ అలీ (20), నురుల్ హసన్ (22) క్రీజ్‌లో ఉన్నారు.
లిట్టన్ దాస్ బంగ్లాదేశ్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. బంగ్లా ప్లేయర్లలో సైఫ్ హస్సన్ 12, తౌహిద్ హృదోయ్ 9, షమీమ్ హొస్సేన్ 21 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కైల్ క్లెయిన్ 3 వికెట్లు పడగొట్టగా.. టిమ్ ప్రింగిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.