
టీమిండియా నయా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు (ICC Player Of The Month Award) గెలుచుకున్నాడు. సెప్టెంబర్ నెలకు గానూ అభిషేక్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం అభిషేక్‌తో పాటు మరో టీమిండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్, జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ పోటీ పడ్డారు. ఓటింగ్ అనంతరం అభిషేక్ విజేతగా ఆవిర్భవించాడు.
అభిషేక్ ఈ అవార్డు గెలుచుకోవడం ఇది మొదటిసారి. భారత్ తరఫున ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న 10వ ఆటగాడు అభిషేక్. అభిషేక్‌కు ముందు శుభ్‌మన్ గిల్ (4 సార్లు), బుమ్రా (2), శ్రేయస్ అయ్యర్ (2), పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, సిరాజ్ ఈ అవార్డు గెలుచుకున్నారు.
అభిషేక్ సెప్టెంబర్ నెలలో విశేషంగా రాణించినందుకు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. టీ20 ఆసియా కప్‌లో అతను 7 మ్యాచ్‌ల్లో 200 స్ట్రైక్ రేట్‌తో, 44.85 సగటున 314 పరుగులు చేశాడు. అభిషేక్ ప్రదర్శనల కారణంగా భారత్ ఆసియా కప్‌ను సునాయాసంగా గెలుచుకుంది.
అభిషేక్ ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్న అభిషేక్.. ఆ ప్రదర్శనల తర్వాత ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
మహిళల విభాగంలో మంధన
మహిళల విభాగంలో సెప్టెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు టీమిండియాకే చెందిన స్మృతి మంధనకు (Smriti Mandhana) దక్కింది. గత నెలలో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో (58, 117, 125) విశేషంగా రాణించినందుకు ఆమె ఈ అవార్డును కైవసం చేసుకుంది.
ఈ అవార్డు కోసం మంధనతో పాకిస్తాన్‌కు చెందిన సిద్రా అమీన్, సౌతాఫ్రికాకు చెందిన తజ్మిన్ బ్రిట్స్ పోటీ పడ్డారు. తిరుగులేని ప్రదర్శన కారణంగా మంధననే ఈ అవార్డు వరించింది.
చదవండి: Chiranjeevi: ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు