ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' నామినీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఆసియాకప్-2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా ప్లేయర్లు అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లు షార్ట్ లిస్ట్ అయ్యారు.
వీరిద్దరితో పాటు జింబాబ్వేకు చెందిన బ్రియాన్ బెన్నెట్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియాకప్‌లో అభిషేక్ పరుగుల వరద పారించాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేశాడు.
ఒక్క ఫైనల్ మ్యాచ్‌లో మినహా మిగితా మ్యాచ్‌లలో ఈ పంజాబ్ ప్లేయర్ దుమ్ములేపాడు. అదేవిధంగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఆసియాకప్‌లో కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 7 మ్యాచ్‌లలో కుల్దీప్ 17 వికెట్లు పడగొట్టాడు.
ఈ మెగా టోర్నీలో కుల్దీప్ కాకుండా షాహీన్ షా అఫ్రిది మాత్రమే 10 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు జింబాబ్వే ప్లేయర్ బెన్నెట్ గత కొంత కాలంగా టీ20 క్రికెట్‌లో అదరగొడుతున్నపాడు. 21 ఏళ్ల బెన్నెట్ గత నెలలో శ్రీలంక, ఉగాండా, నమీబియా, బోట్స్వానాపై అర్ధ సెంచరీలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్-2026 ఆఫ్రికా క్వాలిఫైయర్‌లో టాంజానియాపై కూడా బెన్నెట్ సెంచరీ సాధించాడు. మహిళల విభాగంలో భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ అవార్డు రేసులో ఉంది. గత నెలలో మంధాన ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో 77 సగటుతో 308 పరుగులు చేసింది.
చదవండి: PAK vs SA: ఫ్రీ ఫ్రీ.. రండి బాబు రండి! బ్రతిమాలుకుంటున్న పీసీబీ


