
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. తాజాగా (జులై 30) విడుదల చేసిన ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. తద్వారా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరే క్రమంలో అభిషేక్ ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్‌ను కిందకు దించాడు. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 829 రేటింగ్ పాయింట్లు ఉండగా.. హెడ్ వద్ద 814 పాయింట్లు ఉన్నాయి. ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో కూడా భారత బ్యాటరే ఉన్నాడు. 804 రేటింగ్ పాయింట్లతో తిలక్ వర్మ ఆ స్థానంలో కొనసాగుతున్నాడు.
టాప్-10లో భారత్ టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. స్కై ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉండిన మరో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ (9) తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. భారత బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 25, సంజూ శాంసన్ 33, శుభ్‌మన్ గిల్ 38, హార్దిక్ పాండ్యా 53, రింకూ సింగ్ 56, శివమ్ దూబే 61 స్థానాల్లో ఉన్నారు.
టాప్-10లో అభిషేక్, హెడ్, తిలక్ తర్వాత సాల్ట్, బట్లర్, నిస్సంక, సీఫర్ట్, ఇంగ్లిస్, హోప్ ఉన్నారు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లు ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్ బాగా లబ్ది పొందారు. వీరిలో గ్రీన్ ఏకంగా 64 స్థానాలు మెరుగుపర్చుకొని 24 స్థానానికి ఎగబాకాడు. గ్రీన్ తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విశేషంగా రాణించాడు.
సహచరుడు గిల్ కూడా టాప్‌లోనే..!
టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అభిషేక్ టాప్ ర్యాంక్‌కు చేరగా.. అతని ఆప్త మిత్రుడు శుభ్‌మన్ గిల్ వన్డేల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. వీరిద్దరు టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ దగ్గర శిష్యరికం చేస్తుండటం విశేషం. అభిషేక్, గిల్ టీ20, వన్డే ఫార్మాట్లలో నంబర్ వన్ బ్యాటర్లుగా ఉండగా.. భారత్ రెండు ఫార్మాట్లలో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుంది.
అలాగే టెస్ట్‌ల్లో నంబర్ వన్ బౌలర్‌గా బుమ్రా, నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా, నంబర్ వన్ టీ20 ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నారు.