
ఆసియా కప్-2025లో టీమిండియా పాక్‌ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
రాణించిన ఫర్హాన్
ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు.
ఫీల్డర్ల వైఫల్యం.. భారీగా పరుగులిచ్చిన బుమ్రా
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పాక్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోర్ ఇచ్చారు. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టారు. బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కూడా ఓ మోస్తరు ప్రదర్శనలే చేశారు.
వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్‌ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. అక్షర్ పటేల్‌తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు.
విధ్వంసం సృష్టించిన అభిషేక్
172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయారు. తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 105 పరుగులు జోడించారు. అనంతరం భారత్ పరుగు వ్యవధిలో గిల్, సూర్యకుమార్ యాదవ్ (0) వికెట్లు కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత (123 పరుగుల వద్ద) అభిషేక్ శర్మ కూడా ఔటయ్యాడు.
ఈ దశలో సంజూ శాంసన్, తిలక్ వర్మ నిదానంగా ఆడటంతో స్కోర్ నెమ్మదించింది. 148 పరుగుల వద్ద సంజూ (13) ఓ చెత్త షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అనంతరం హార్దిక్ (7 నాటౌట్) సాయంతో తిలక్ వర్మ (30 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్‌కు తలో వికెట్ దక్కాయి.