2025 సంవత్సరం.. క్రీడా రంగంలో అనేక విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. ఆసియాకప్ నో షేక్ హ్యాండ్ నుంచి ఎన్బీఏ (NBA) బెట్టింగ్ స్కామ్ వరకు చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టాప్-5 కాంట్రవర్సీలపై ఓ లుక్కేద్దాం.

నో హ్యాండ్ షేక్..
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 'నో హ్యాండ్‌షేక్' వివాదం క్రీడా ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఒక సంప్రదాయం.
కానీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. సూర్య బాటలోనే మిగితా భారత ప్లేయర్లు కూడా నడిచారు. టోర్నీ అసాంతం పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టుగానే వ్యవహరిచింది. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించలేదు.
ఆ తర్వాత ఆసియా కప్ గెలిచిన తర్వాత ఏసీసీ చైర్మెన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసియాకప్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA)ని బెట్టింగ్ కుంభకోణం కుదిపేసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) చేసిన దాడులలో కొంతమంది బాస్కెట్‌బాల్ దిగ్గజాలు.. మాఫియా ముఠాలతో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లు మాఫియా ముఠాలతో కలిసి ఇన్‌సైడర్ సమాచారాన్ని బెట్టింగ్ కోసం వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో చాన్సీ బిలప్స్, టెర్రీ రోజియర్, డామన్ జోన్స్ వంటి దిగ్గజాలు నిందితులగా ఉన్నారు.

'గ్రోవెల్' (Grovel) వివాదం
ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. అయితే రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ నాడ్.. భారత జట్టును ఉద్దేశించి "గ్రోవెల్" (మా ముందు సాష్టాంగపడేలా చేస్తాం) అనే పదాన్ని వాడటం పెద్ద రచ్చకు దారితీసింది. ఇది జాత్యహంకారానికి ప్రతీకగా పరిగణించబడింది. దీనిపై సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ సైతం తప్పుబట్టాడు. ఆ తర్వాత షుక్రీ నాడ్ క్షమాపణలు చెప్పాడు.

మెద్వెదేవ్ ఆగ్రహం
యూఎస్ ఓపెన్ 2025 తొలి రౌండ్‌లోనే రష్యా టెన్నిస్ ఆటగాడు డానియిల్ మెద్వెదేవ్ వెనుదిరిగాడు. ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో ఓడిపోడంతో మెద్వెదేవ్ అసహనానికి గురయ్యాడు. అతడు తన రాకెట్‌ను అక్కడే విరగ్గొట్టాడు. అంతకుముందు కోర్టులో ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. అంపైర్లతో కూడా వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడికి 42,500 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 37 లక్షలు) జరిమానాను నిర్వాహకులు విధించారు.

హర్భజన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు
ఐపీఎల్-2025 సీజన్ సమయంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వ్యాఖ్యాతగా వ్యహరించిన హర్భజన్.. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను లండన్‌లోని 'నల్ల టాక్సీ' (Kaali Taxi) తో పోల్చాడు. దీంతో జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని భజ్జీపై విమర్శల వర్షం కురిసింది.


