
టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra)స్పందించాడు. షమీ బాధలో అర్థం ఉందని.. అయితే, అందరూ నాణేనికి మరోవైపు కూడా చూడాలని అన్నాడు.
చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో భాగంగా టీమిండియాకు ఆడాడు షమీ. ఈ వన్డే మెగా టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసిన ఈ బెంగాల్ పేసర్‌ను.. ఆస్ట్రేలియాతో వన్డేలకు సెలక్టర్లు పక్కనపెట్టారు. అతడి ఫిట్‌నెస్ గురించి తమకు అప్‌డేట్ లేదంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా మీడియాతో పేర్కొన్నాడు.
అది నా పని కాదు
ఈ నేపథ్యంలో షమీ స్పందిస్తూ.. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నానంటూ సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చాడు. రంజీల్లో ఆడే వాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. ‘‘ఫిట్‌నెస్ గురించి సమాచారం ఇవ్వడం లేదంటే అడగటం నా పని కాదు.. జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి సన్నద్ధ కావడమే నా చేతుల్లో ఉంటుంది’’ అంటూ పరోక్షంగా అగార్కర్‌ను టార్గెట్ చేశాడు.
సెలక్టర్లను బాగానే విమర్శిస్తున్నావు షమీ!.. కానీ
ఈ విషయంపై కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తాజాగా స్పందిస్తూ.. ‘‘టీమిండియా సెలక్షన్ కమిటీ గురించి షమీ చాలా గట్టిగానే మాట్లాడుతున్నాడు. విమర్శిస్తున్నాడు. అయితే, ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి.
ఇరువర్గాల మాటల్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కోచ్, కెప్టెన్ లేదంటే సెలక్టర్ ఎవరో ఒకరు షమీ వ్యాఖ్యలపై స్పందించేదాకా వేచి చూడాలి. అంతవరకు ఈ విషయంలో తప్పు ఎవరిదో నిర్ధారించలేము.
అతడి ఆవేదనలో అర్థం ఉంది
ఏదేమైనా సెలక్టర్లు షమీని పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. కాబట్టి అతడి బాధ, ఆవేదనలో అర్థం ఉంది. ఒకవేళ షమీ తన ఫిట్‌నెస్‌తో సంతృప్తి చెందినా.. సెలక్టర్లు పక్కనపెడితే అది తన దురదృష్టమే. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. షమీ గనుక తిరిగి టీమిండియాలోకి రావాలనుకుంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
చెలరేగిన షమీ
టీమిండియా పేసర్ షమీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో మెరిశాడు. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ఈ సీనియర్ పేసర్... ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తరఫున ఆకట్టుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 72.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది.
భుపెన్ లాల్‌వాని (128 బంతుల్లో 71; 9 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... బెంగాల్ బౌలర్లలో షమీ 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ పొరెల్ 3, సూరజ్ సింధు జైస్వాల్ 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంంచిన బెంగాల్ బుధవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.
ఇక 8/1 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన బెంగాల్.. 50 ఓవర్ల ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టాఇకి 142 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 71 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్.. టీ20 మ్యాచ్ అనుకున్నావా?