
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదింది.
కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.
రెండు మ్యాచ్‌ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం విశేషం. భారత్‌తో మ్యాచ్‌లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్‌పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.
నేటి మ్యాచ్‌లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ గెలుపుతో ఆసీస్ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్‌కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్.. న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్‌పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది.
చదవండి: చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..!