330 సరిపోలేదు | Australia breaks world record target | Sakshi
Sakshi News home page

330 సరిపోలేదు

Oct 13 2025 4:18 AM | Updated on Oct 13 2025 4:18 AM

Australia breaks world record target

భారీ స్కోరు చేసినా భారత్‌కు తప్పని ఓటమి

ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా

3 వికెట్లతో గెలిచిన డిఫెండింగ్‌ చాంపియన్‌ 

అలీసా హీలీ అద్భుత సెంచరీ

అనాబెల్‌ సదర్లాండ్‌కు 5 వికెట్లు 

 మూడు వికెట్లతో రాణించిన శ్రీచరణి  

స్టార్‌ బ్యాటర్‌ స్మృతి ఫామ్‌లోకి వచ్చింది. ప్రతీక, జెమీమా కూడా రాణించారు. 330 పరుగుల భారీ స్కోరు నమోదైంది. పిచ్‌ బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగానే ఉన్నా... ఈ భారీ స్కోరును కాపాడుకోవచ్చని భారత మహిళలు భావించారు. కానీ అటువైపు ఉన్నది ఆస్ట్రేలియా... కెప్టెన్ అలీసా హీలీ నేతృత్వంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ జట్టు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది.

 చివర్లో కొన్ని అవకాశాలు సృష్టించుకొని భారత్‌ పట్టు బిగించినట్లు కనిపించినా... ప్రత్యర్థి విజయాన్ని ఆపడానికి అవి సరిపోలేదు. దాంతో గత మ్యాచ్‌ తరహాలోనే గెలుపునకు చేరువైనట్లు కనిపించినా... మరో ఓటమితో టీమిండియాకు నిరాశ తప్పలేదు.  

సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: సొంతగడ్డపై మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో భారత్‌కు మరో నిరాశజనక ఫలితం ఎదురైంది. ఆదివారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. అన్ని వరల్డ్‌కప్‌లలో కలిపి భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 

ఓపెనర్లు స్మృతి మంధాన (66 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రతీక రావల్‌ (96 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 24.3 ఓవర్లలో 155 పరుగులు జోడించారు. ఆ్రస్టేలియా బౌలర్‌ అనాబెల్‌ సదర్లాండ్‌ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం ఆ్రస్టేలియా 49 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు సాధించి గెలిచింది. మహిళల వన్డేల చరిత్రలో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అలీసా హీలీ (107 బంతుల్లో 142; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో చెలరేగింది. ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. భారత్‌ తమ తర్వాతి పోరులో ఈ నెల 19న ఇంగ్లండ్‌తో ఇండోర్‌లో తలపడుతుంది. నేడు విశాఖపట్నంలో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా తలపడుతుంది.  

భారత ఓపెనర్లు ప్రతీక, స్మృతి ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా మొదలు పెట్టారు. ఫలితంగా తొలి 7 ఓవర్లలో 26 పరుగులే వచ్చాయి. పవర్‌ప్లే తర్వాత 11–15 ఓవర్లలో భారత్‌ 15 పరుగులే చేసింది.  ఓపెనర్లు ధాటిని పెంచడంతో 21–24 మధ్య 4 ఓవర్లలోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు రావడం విశేషం. ఎట్టకేలకు స్మృతిని అవుట్‌ చేసి మోలినే ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. 

ఆ తర్వాత హర్లీన్‌ డియోల్‌ (38; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకోగా, 30 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 192/1కు చేరింది. అయితే తర్వాతి బంతికే ప్రతీక వెనుదిరగ్గా, హర్మన్‌ప్రీత్‌ (22; 3 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగింది. అయితే జెమీమా రోడ్రిగ్స్‌ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు), రిచా ఘోష్‌ (22 బంతుల్లో 32; 3 ఫోర్లు,  2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శిస్తూ స్కోరును 300 దాటించారు.

వీరిద్దరు ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 54 పరుగులు జత చేశారు. అయితే ఆఖర్లో భారీ షాట్‌లకు యత్నించి భారత బ్యాటర్లు వరుసగా వెనుదిరిగారు. 36 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్‌ మరో 7 బంతుల ముందే ముగిసింది. 

ఓపెనర్ల దూకుడు... 
భారీ ఛేదనలో ఆసీస్‌కు ఓపెనర్లు హీలీ, లిచ్‌ఫీల్డ్‌ ఘనమైన ఆరంభం  అందించారు. క్రాంతి ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో హీలీ దూకుడు కనబర్చగా, అమన్‌జోత్‌ ఓవర్లో లిచ్‌ఫీల్డ్‌ 4 ఫోర్లు బాదింది. తొలి వికెట్‌కు వీరిద్దరు 68 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. అయితే లిచ్‌ఫీల్డ్‌తో పాటు తక్కువ వ్యవధిలో బెత్‌ మూనీ (4), అనాబెల్‌ సదర్లాండ్‌ (0) అవుటయ్యారు. 

కానీ మరోవైపు హీలీ ఎక్కడా తగ్గకుండా ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ క్రమంలోనే 84 బంతుల్లో ఆమె శతకం పూర్తి చేసుకుంది. ఆసీస్‌ విజయానికి చేరువవుతున్న దశలో ఒక్కసారిగా భారత బౌలర్లు పైచేయి సాధించారు. ఫలితంగా 38 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఒత్తిడిని అధిగమించి ఆసీస్‌ ఒక ఓవర్‌ ముందే గెలిచింది.

112 స్మృతి 5 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు పట్టిన ఇన్నింగ్స్‌ల సంఖ్య. మహిళల వన్డేల్లో అందరికంటే వేగంగా ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే ఇన్నింగ్స్‌లో ఒకే ఏడాది 1000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కూడా స్మృతి గుర్తింపు పొందింది.

331 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. శ్రీలంక జట్టు (302 దక్షిణాఫ్రికాపై 2024లో) పేరిట ఉన్న రికార్డును ఆస్ట్రేలియా అధిగమించింది.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: ప్రతీక (సి) పెరీ (బి) సదర్లాండ్‌ 75; స్మృతి (సి) లిచ్‌ఫీల్డ్‌ (బి) మోలినే 80; హర్లీన్‌ (సి) సదర్లాండ్‌ (బి) మోలినే 38; హర్మన్‌ప్రీత్‌ (సి) మోలినే (బి) షుట్‌ 22; జెమీమా (సి) మూనీ (బి) సదర్లాండ్‌ 33; రిచా (సి) (సబ్‌) వేర్‌హమ్‌ (బి) సదర్లాండ్‌ 32; అమన్‌జోత్‌ (సి) మోలినే (బి) గార్డ్‌నర్‌ 16; దీప్తి (సి) మూనీ (బి) మోలినే 1; స్నేహ్‌ (నాటౌట్‌) 8; క్రాంతి (సి) (సబ్‌) వేర్‌హమ్‌ (బి) సదర్లాండ్‌ 1; శ్రీచరణి (బి) సదర్లాండ్‌ 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 330. వికెట్ల పతనం: 1–155, 2–192, 3–234, 4–240, 5–294, 6–309, 7–320, 8–327, 9–330, 10–330. బౌలింగ్‌: గార్త్‌ 5–0–35–0, షుట్‌ 6.1–0–37–1, యాష్లే గార్డ్‌నర్‌ 7–0–40–1, మోలినే 10–1–75–3, సదర్లాండ్‌ 9.5–0–40–5, తాలియా మెక్‌గ్రాత్‌ 4.5–0–43–0, అలానా కింగ్‌ 6–0–49–0. 

ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: హీలీ (సి) స్నేహ్‌ (బి) శ్రీచరణి 142; లిచ్‌ఫీల్డ్‌ (సి) స్నేహ్‌ (బి) శ్రీచరణి 40; ఎలీస్‌ పెరీ (నాటౌట్‌) 47; మూనీ (సి) రోడ్రిగ్స్‌ (బి) దీప్తి 4; సదర్లాండ్‌ (బి) శ్రీచరణి 0; యాష్లే గార్డ్‌నర్‌ (బి) అమన్‌జోత్‌ 45; తాలియా మెక్‌గ్రాత్‌ (ఎల్బీ) (బి) దీప్తి 12; మోలినే (ఎల్బీ) (బి) అమన్‌జోత్‌ 18; కిమ్‌ గార్త్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో 7 వికెట్లకు) 331. వికెట్ల పతనం: 1–85, 2–168, 3–170, 4–265, 5–279, 6–299, 7–303. బౌలింగ్‌: అమన్‌జోత్‌ 9–0–68–2, క్రాంతి 9–1–73–0, స్నేహ్‌ రాణా 10–0–85–0, శ్రీచరణి 10–1–41–3, దీప్తి 10–0–52–2, హర్మన్‌ప్రీత్‌ 1–0–10–0. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement