
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వంటి మెగా టోర్నమెంట్లలో కనీసం సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది. ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పరిస్థితి అంతంత మాత్రమే.
సల్మాన్ ఆఘాకు పగ్గాలు
ఈ క్రమంలో 2024లో బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మహ్మద్ రిజ్వాన్ పాక్ జట్టు వన్డే, టీ20 పగ్గాలు చేపట్టాడు. కానీ ఏడాదిలోపే బాబర్‌తో కలిసి టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు రిజ్వాన్. ఆసియా కప్-2025 టీ20 టోర్నీకి పాక్ బోర్డు ప్రకటించిన జట్టులోనూ వీరిద్దరికి స్థానం దక్కలేదు.
టీ20 ట్రై సిరీస్
ఇక రిజ్వాన్ స్థానంలో పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సల్మాన్ ఆఘా.. చివరగా ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో 2-1తో సిరీస్ నెగ్గాడు. ఈ క్రమంలో ఆసియా టోర్నీకి సన్నాహకంగా తదుపరి యూఏఈ- అఫ్గనిస్తాన్‌తో సల్మాన్ బృందం టీ20 ట్రై సిరీస్ ఆడనుంది. ఆగష్టు 29- సెప్టెంబరు 7 వరకు ఈ ముక్కోణపు సిరీస్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో యూఏఈ, అఫ్గనిస్తాన్ కెప్టెన్లతో కలిసి సల్మాన్ ఆఘా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి చేదు అనుభవం ఎదురైంది.
ఆసియాలో రెండో అత్యుత్తమ జట్టుగా అఫ్గనిస్తాన్
ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌కు ప్రశ్న సంధిస్తూ.. ‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆసియాలో రెండో అత్యుత్తమ క్రికెట్ జట్టుగా అఫ్గనిస్తాన్ నిలిచింది కదా!’ అని పేర్కొన్నాడు.
పాపం ముఖం మాడిపోయింది!
ఇందుకు ఓ వైపు రషీద్ ఖాన్ బదులిస్తుంటే.. సల్మాన్ ఆఘా ముఖం మాత్రం మాడిపోయింది. ‘‘ఇదేందయ్యా ఇది.. అబ్బో.. అటూ ఇటూ తిరిగి మావైపే విమర్శనాస్త్రాలు వచ్చేలా ఉన్నాయే’’ అన్నట్లుగా అతడి ముఖకవలికలు మారిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు.. ‘‘పాపం.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. మీకంటే అఫ్గనిస్తాన్ బెటర్ అని మీ వాళ్లే చెబుతుంటే.. ఇంతకంటే ఇంకేం చేస్తారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో అఫ్గనిస్తాన్ సంచలన విజయాలు సాధించింది.
అఫ్గన్ సంచలన ప్రదర్శన
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది అఫ్గన్ జట్టు. మరోవైపు.. పాకిస్తాన్ అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి లీగ్ దశ దాటకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇక ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: Danish Malewar: డబుల్ సెంచరీతో చెలరేగిన యువ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు
Agha’s reaction when a journalist in PC called Afghanistan the second best team
in Asia 😭😭😭😭 pic.twitter.com/vKd4jQImNn— 𝐀. (@was_abdd) August 28, 2025