ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్‌ కెప్టెన్‌.. సూర్య, రషీద్‌ ఖాన్‌ ఏం చేశారంటే? | Asia Cup 2025: India vs Pakistan Captains in Press Meet, Exciting Rivalry Ahead | Sakshi
Sakshi News home page

ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్‌ కెప్టెన్‌.. సూర్య, రషీద్‌ ఖాన్‌ ఏం చేశారంటే?

Sep 9 2025 4:34 PM | Updated on Sep 9 2025 4:55 PM

Pak Captain Walks Off Before Handshakes Suryakumar Does This Viral video

క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్‌ గురించే చర్చ. ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో (2023 వన్డే ఫార్మాట్‌ విజేత ) టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. టీ20 ఫార్మాట్లో గత చాంపియన్‌గా శ్రీలంక పోటీలో ఉంది.

ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్‌.. యూఏఈ వేదికగా ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో గ్రూప్‌-‘ఎ’ నుంచి టీమిండియాతో పాటు పాకిస్తాన్‌, యూఏఈ, ఒమన్‌ పోటీలో ఉన్నాయి. ఇక గ్రూప్‌- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, హాంకాంగ్‌ పోటీపడుతున్నాయి.

కెప్టెన్ల మీడియా సమావేశం
ఇక సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్‌ టోర్నీ జరుగనుండగా.. మంగళవారం ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి టీమిండియా- పాకిస్తాన్‌ కెప్టెన్లపైనే కేంద్రీకృతమైంది.

సూర్య - సల్మాన్‌ మధ్యలో రషీద్‌
భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రెస్‌మీట్‌లో అఫ్గన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ పక్కన కూర్చున్నాడు. ఇక పాక్‌ జట్టు నాయకుడు సల్మాన్‌ ఆఘా రషీద్‌కు మరోవైపు కూర్చున్నాడు. విలేకరులతో మాట్లాడిన అనంతరం సల్మాన్‌ ఆఘా.. హాంకాంగ్‌, ఒమన్‌ కెప్టెన్లతో కలిసి ముందుగానే వేదిక దిగిపోయాడు.

సారథుల ఆలింగనం.. పాక్‌ కెప్టెన్‌ మిస్‌
ఇంతలో రషీద్‌- సూర్యతో మాట్లాడుతూ నవ్వులు చిందించగా.. యూఏఈ కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం వచ్చి ఒక్కొక్కరిగా వేదికపై ఉన్న జట్ల సారథులను ఆలింగనం చేసుకుని కరచాలనం చేశాడు. ఈ క్రమంలో సూర్య, రషీద్‌ శ్రీలంక కెప్టెన్‌ చరిత్‌ అసలంక, బంగ్లా సారథి లిటన్‌ దాస్‌లకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి హగ్‌ చేసుకున్నారు.

ఆ తర్వాత..
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలోకి రాగా.. టీమిండియా- పాకిస్తాన్‌ కెప్టెన్లు దూరం దూరంగానే ఉన్న వార్త ప్రచారం అయింది. అయితే, ఇంకో వీడియోలో మిగతా కెప్టెన్లతో పాటు సల్మాన్‌కు కూడా సూర్య షేక్‌హ్యాండ్‌ ఇచ్చినట్లు కనిపించింది.

కేంద్రం అనుమతితోనే..
కాగా పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాలు భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో క్రీడల్లోనూ అన్ని స్థాయిల్లోనూ పాకిస్తాన్‌తో బంధం తెంచుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. 

అయితే, ఆసియా కప్‌ మల్టీలేటరల్‌ టోర్నీ కావున చిరకాల ప్రత్యర్థితో టీమిండియా మ్యాచ్‌ ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడం గమనార్హం.

ఇక ప్రెస్‌మీట్‌లో అంటీముట్టనట్టుగానే ఉన్న భారత్‌- పాక్‌ జట్ల సారథులు ఆఖర్లో కర్టసీగా కరచాలనం చేసుకోవడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనున్న సూర్యకుమార్‌ సేన.. 14న దాయాది పాక్‌తో తలపడుతుంది. లీగ్‌ దశలో ఆఖరిగా సెప్టెంబరు 19న ఒమన్‌తో మ్యాచ్‌ ఆడుతుంది.

చదవండి: ఆసియా కప్‌-2025: పూర్తి షెడ్యూల్‌, అన్ని జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement