
టీమిండియా అత్యధికంగా ఎనిమిదిసార్లు.. శ్రీలంక ఆరుసార్లు.. పాకిస్తాన్ రెండుసార్లు.. ఆసియా కప్ (Asia Cup) టైటిల్‌ను గెలిచాయి. ఇక ఈ ఖండాంతర టోర్నమెంట్లో బంగ్లాదేశ్ మూడుసార్లు ఫైనల్ చేరగలిగింది. కానీ కప్ మాత్రం గెలవలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఇక ఆసియా కప్ తాజా ఎడిషన్‌లో గ్రూప్- ‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra).. అఫ్గనిస్తాన్ జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటిన అఫ్గన్‌కు.. ఈసారి ఆసియా కప్ టైటిల్ రేసులో నిలిచే అవకాశం ఉందన్నాడు.
తేలికగా తీసిపారేసే జట్టు కాదు
‘‘ఇప్పటి వరకు వాళ్లు తోడి పెళ్లికూతుళ్లుగా మాత్రమే ఉన్నారు. పెళ్లికూతురు మాత్రం కాలేకపోయారు. అంటే.. వారి ప్రాముఖ్యత ఇంకా పెరగలేదని అర్థం. అయితే, అంత తేలికగా తీసిపారేసే జట్టు కూడా కాదు. అఫ్గన్ క్రికెటర్లను మనం గౌరవిస్తాం.. ప్రశంసలు కురిపిస్తాం.
కానీ వారు ఇంత వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఆసియా కప్ గెలవలేదు. టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనల్‌కు వెళ్లడం.. వన్డే వరల్డ్‌కప్-2023లో రాణించడం.. గొప్ప విషయాలు.
ఈసారైనా గెలవండి
అయితే, ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగడం.. ఆ జట్టుకు టైటిల్ గెలిచేందుకు సువర్ణావకాశాన్ని ఇచ్చింది. దీనిని వారు సద్వినియోగం చేసుకుంటారో.. లేదో చూడాలి. సెదీఖుల్లా అటల్, డార్విష్ రసూలీ, అల్లా ఘజన్‌ఫర్ వంటి యువ ఆటగాళ్లకు ఇదొక మంచి అవకాశం. ఒకవేళ వారు ఇక్కడ రాణిస్తే గనుక ఐపీఎల్‌లోనూ మంచి అవకాశాలు వస్తాయి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
తమ బలమైన స్పిన్ మాయాజాలంలో ప్రత్యర్థిని బంధిస్తే అఫ్గనిస్తాన్ గెలుపు సులువేనన్న ఆకాశ్ చోప్రా.. రహ్మనుల్లా గుర్బాజ్ శుభారంభం అందిస్తే బ్యాటింగ్ పరంగానూ తిరుగు ఉండదని పేర్కొన్నాడు. ఇబ్రహీం జద్రాన్ కూడా తన వంతు పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నాడు.
అయితే, అఫ్గన్ జట్టులో ఉన్న ప్రధాన బలహీనత.. నిలకడలేమి అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రతి ఒక్క జట్టుకు ఇలాంటి బలహీనత ఉంటుందని.. ప్రతిసారీ గెలవడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. కాబట్టి సరైన సమయంలో రాణించి కప్ గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రషీద్ ఖాన్ బృందానికి సూచించాడు.
ఆసియాకప్-2025 టోర్నీకి అఫ్గనిస్తాన్ జట్టు ఇదే
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లా ఘజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ
రిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.
చదవండి: చరిత్ర సృష్టించిన బవుమా బృందం.. బ్రీట్జ్కే వరల్డ్ రికార్డుతో..