
ఇంగ్లండ్ గడ్డ మీద తెంబా బవుమా బృందం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరవై ఏడేళ్ల తర్వాత తొలిసారి ఆతిథ్య జట్టుపై వన్డే సిరీస్ (END vs SA ODI Series) గెలిచింది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.
ఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. మంగళవారం లీడ్స్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తాజాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది సౌతాఫ్రికా.
బ్రీట్జ్కే, స్టబ్స్ హాఫ్ సెంచరీలు
టాపార్డర్‌లో ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (49), రియాన్ రికెల్టన్ (35) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తెంబా బవుమా (4) మాత్రం నిరాశపరిచాడు. ఇక మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
మొత్తంగా 77 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (58), డెవాల్డ్ బ్రెవిస్ (42), కార్బిన్ బాష్ (32 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన సౌతాఫ్రికా 330 పరుగులు సాధించింది.
ఆఖరి వరకు పోరాడినా
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆదిల్ రషీద్ రెండు, జేకబ్ బెతెల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇంగ్లండ్ ఓపెనర్లు జేమీ స్మిత్ (0), బెన్ డకెట్ (14) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన జో రూట్ (61), నాలుగో నంబర్ బ్యాటర్ జేకబ్ బెతెల్ (58) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 33 పరుగులు చేయగా.. మాజీ సారథి జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ (61)తో అదరగొట్టాడు. ఇక విల్‌జాక్స్ 39 పరుగులు చేయగా.. ఆర్చర్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ (14 బంతుల్లో 27 నాటౌట్) ఆడాడు.
నరాలు తెగే ఉత్కంఠ
అయితే చివరి ఓవర్లో ఇంగ్లండ్ గెలుపునకు 16 పరుగులు అవసరం కాగా.. సకీబ్ మహమూద్ (2*), ఆర్చర్ విజయం దిశగా జట్టును తీసుకెళ్లారు. తొలి బంతికి సకీబ్ ఒక పరుగు తీయగా.. మూడో బంతికి ఆర్చర్ ఫోర్ కొట్టాడు. మరలా ఐదో బంతిని బౌండరీకి తరలించాడు.
ఫలితంగా ఆఖరి బంతికి ఆరు పరుగులు చేస్తే సూపర్ ఓవర్ అవసరమయ్యేది. అయితే, సేన్ ముత్తుస్వామి ఇన్‌సైడ్ ఎడ్జ్‌గా అద్భుత బంతి సంధించగా.. ఆర్చర్ ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా ఐదు పరుగుల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది.
బ్రీట్జ్కే ప్రపంచ రికార్డు.. బవుమా బృందం సరికొత్త చరిత్ర
కాగా వన్డేల్లో ఆడిన తొలి మ్యాచ్‌లలో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా మాథ్యూ బ్రీట్జ్కే ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు వన్డేల్లో కలిపి అతడు 463 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ గడ్డ మీద.. 1998లో చివరగా సౌతాఫ్రికా వన్డే సిరీస్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
చదవండి: IPL 2026: గుజరాత్ టైటాన్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర వీరుడు?