
పొట్టి క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచేందుకు ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ (AFG vs HK) మ్యాచ్‌తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ మెగా ఈవెంట్‌కు తెరలేస్తుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో పాటు.. రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), చరిత్ అసలంక (శ్రీలంక), లిటన్ దాస్ (బంగ్లాదేశ్), సల్మాన్ ఆఘా (పాకిస్తాన్), జతీందర్ సింగ్ (ఒమన్), ముహమ్మద్ వసీం (యూఏఈ), యాసిమ్ ముర్తాజా (హాంకాంగ్) విలేకరులతో ముచ్చటించారు.
హుందాగా బదులిచ్చిన సూర్య
ఈ క్రమంలో ఆసియా కప్ తాజా ఎడిషన్ టోర్నీ విజేతగా టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్న వచ్చింది. ఇందుకు సూర్య తనదైన శైలిలో హుందాగా సమాధానమిచ్చాడు. ‘‘మీకెవరు ఈ విషయం చెప్పారు?.. నేనైతే ఎప్పుడూ వినలేదు.
అయితే, సుదీర్ఘకాలంగా మేము టీ20 క్రికెట్‌లో ఉత్తమంగా రాణిస్తున్నాం. ఇప్పుడు కూడా టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాము’’ అని సూర్య తెలిపాడు. ఇక ఇదే ప్రశ్నకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.
షాకింగ్‌గా సల్మాన్ సమాధానం
టీమిండియాను ఫేవరెట్‌గా భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘టీ20 క్రికెట్‌లో గంట.. రెండు గంటల సమయంలోనే అంతా తలకిందులైపోతాయి. మ్యాచ్ రోజు ఎవరైతే గొప్పగా ఆడతారో వారిదే విజయం. అందుకే ఈ ఫార్మాట్ టోర్నీలో ఓ జట్టు ఫేవరెట్‌గా ఉంటుందని నేను అనుకోను’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.
మైదానంలో వాళ్లను ఆపను
ఇక మైదానంలో ఫాస్ట్‌బౌలర్లను కట్టడి చేస్తారా అని విలేకరులు అడుగగా.. ‘‘ఫాస్ట్ బౌలర్లు అంటేనే దూకుడుగా ఉంటారు. వారిని దాని నుంచి మనం వేరుచేయలేము. ఎవరైతే మైదానంలో అగ్రెసివ్ ఉండాలనుకుంటారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
క్రీడా స్ఫూర్తికి భంగం కలగనంత వరకు స్వేచ్ఛ కొనసాగుతుంది. నా వైపు నుంచైతే ఫాస్ట్‌బౌలర్లపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు’’ అని సల్మాన్ ఆఘా స్పష్టం చేశాడు.
కాగా ఆసియా కప్-2025 టోర్నీకి ముందు పాకిస్తాన్.. యూఏఈ- అఫ్గనిస్తాన్‌లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఇందులో యూఏఈ, అఫ్గన్‌లపై వరుస విజయాలతో ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో రషీద్ ఖాన్ బృందాన్ని ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పాక్ బరిలోకి దిగుతోంది.
టీమిండియాదే హవా
ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీలో ఆది నుంచీ టీమిండియాదే హవా. ఇప్పటికి ఎనిమిది సార్లు భారత్ టైటిల్ గెలవగా.. శ్రీలంక ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే ట్రోఫీని సొంతం చేసుకోగలిగింది. ఇక ఈసారి దాయాదులు భారత్- పాక్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి.
చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే?