
షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రపు మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది.
అఫ్గాన్ బ్యాటర్లలో దర్విష్ రసూలి(32) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అటల్(28), ముజీబ్(23) పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచారు. సిరీస్ అంతటా అఫ్గాన్ బ్యాటర్లు తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫుద్దీన్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. తంజిమ్ హసన్ సాకిబ్, నసీం అహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు షోర్‌ఫుల్ ఇస్లాం, రిషాద్ చెరో వికెట్ పడగొట్టారు.
సైఫ్ మెరుపు హాఫ్ సెంచరీ..
అనంతరం 145 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా టైగర్స్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సైఫ్ హసన్(38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
అతడితో పాటు తంజీద్ 33 పరుగులతో రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెండు, ఓమర్జాయ్ అబ్దుల్లా తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: Abhishek Sharma: ఆసీస్‌పై అభిషేక్ మళ్లీ ఫెయిల్.. ఇలా అయితే కష్టమే?