ఆసీస్‌పై అభిషేక్ మ‌ళ్లీ ఫెయిల్‌.. ఇలా అయితే క‌ష్ట‌మే? | Abhishek Sharma Struggles In ODI Format, India A Seal Series 2-1 Against Australia A | Sakshi
Sakshi News home page

Abhishek Sharma: ఆసీస్‌పై అభిషేక్ మ‌ళ్లీ ఫెయిల్‌.. ఇలా అయితే క‌ష్ట‌మే?

Oct 6 2025 9:00 AM | Updated on Oct 6 2025 9:59 AM

Abhishek Sharma fail against Australia A

అభిషేక్‌ శర్మ(పాత ఫోటో)

టీ20ల్లో దుమ్ములేపుతున్న టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌.. 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. స్వ‌దేశంలో ఆస్ట్రేలియా-ఎతో జ‌రిగిన అనాధికారిక వ‌న్డే సిరీస్‌లో భార‌త్‌-ఎ త‌ర‌పున ఆడిన‌ అభిషేక్ తీవ్ర‌ నిరాశ‌ప‌రిచాడు. కాన్పూర్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో గోల్డెన్ డ‌కౌట్‌గా వెనుదిరిగిన ఈ పంజాబ్ క్రికెట‌ర్ ఇప్పుడు మూడో వ‌న్డేలోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు.

25 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ రెండు ఫోర్లు సాయంతో 22 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. స్పిన్న‌ర్ టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో త‌న్వీర్ సంఘాకు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. అభిషేక్ ఈ త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తే  భార‌త వ‌న్డే జ‌ట్టులోకి ఎంట్రీ ఇప్ప‌టిలో క‌ష్ట‌మ‌నే చెప్పాలి.

ఎందుకంటే ఓపెనింగ్ స్ధానాల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇప్ప‌టికే వ‌న్డే జ‌ట్టులో రెగ్యూల‌ర్ ఓపెన‌ర్లుగా శుబ్‌మ‌న్ గిల్‌, రోహిత్ శ‌ర్మ కొన‌సాగుతున్నారు. బ్యాక‌ప్ ఓపెన‌ర్‌గా య‌శ‌స్వి జైశ్వాల్ ఉన్నాడు. అవ‌స‌ర‌మైతే కేఎల్ రాహుల్‌ సైతం ఓపెన‌ర్‌గా ప్ర‌మోట్ చేసే అవ‌కాశ‌ముంది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న విజ‌య్ హాజారే ట్రోఫీలో అభిషేక్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తే సెల‌క్ట‌ర్ల దృష్టిలో పడే అవకాశముంది. 

అక్కడ కూడా విఫలమైతే అభిషేక్ కేవలం టీ20లకే పరిమితం కాక తప్పదు. ఇటీవల ముగిసిన ఆసియాక‌ప్‌లో శ‌ర్మ దుమ్ములేపాడు. అభిషేక్‌ 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో కూడా ఈ పంజాబీ ఆట‌గాడికి మెరుగైన గణాంకాలు ఉన్నాయి.

అభిషేక్ శర్మ తన కెరీర్‌లో ఇప్పటివరకు 61 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడి 35.33 సగటుతో 2,014 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 170గా ఉంది. అదేవిధంగా బౌలింగ్‌లో కూడా 38 వికెట్లు పడగొట్టాడు.

భార‌త్ ఘ‌న విజ‌యం..
కాగా నిర్ణ‌యాత్మ‌క మూడో వ‌న్డేలో భార‌త్‌-ఎ జ‌ట్టు 2 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో శ్రేయ‌స్ అయ్య‌ర్ సేన సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌ (75 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... లియామ్‌ స్కాట్‌ (64 బంతుల్లో 73; 1 ఫోర్, 6 సిక్స్‌లు), కూపర్‌ కొనొల్లీ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలు చేశారు. 

మొత్తంగా ఆసీస్‌ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో 15 సిక్స్‌లు కొట్టారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన హర్షిత్‌ రాణా 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆయుశ్‌ బదోనీ 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

అనంతరం లక్ష్యఛేదనలో భారత ‘ఎ’ జట్టు 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసి గెలిచింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (68 బంతుల్లో 102; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. ప్రభ్‌సిమ్రన్‌ ధనధాన్‌ సెంచరీకి తోడు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (58 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రియాన్‌ పరాగ్‌ (55 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలు తోడవడంతో భారత జట్టు అలవోకగా గెలుపొందింది.

ఆసీస్‌ బౌలర్లలో టాడ్‌ మార్ఫీ, తన్వీర్‌ సంఘా చెరో 4 వికెట్లు తీశారు. ప్రభ్‌సిమ్రన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, రియాన్‌ పరాగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో సైతం భారత ‘ఎ’ జట్టే విజయం సాధించింది.
చదవండి: మా ఓట‌మికి కార‌ణ‌మదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్‌ కెప్టెన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement